రైతులు దళారులను ఆశ్రయించొద్దు

రైతులు దళారులను ఆశ్రయించొద్దు

     జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం
    వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్

వికారాబాద్, వెలుగు :  జిల్లాలో రైతుల నుంచి యాసంగి ధాన్యం సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నట్లు వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించవద్దని సూచించారు.  సోమవారం సాయంత్రం  సివిల్ సప్లయ్ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో 129 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ తొలి వారంలోనే  ప్రారంభించామని తెలిపారు.

జిల్లాలో అంచనా మేరకు1,19,350  మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ముందస్తుగానే  వరి పంటకు కనీస మద్దతు ధర క్వింటాలుకు  గ్రేడ్ (-ఏ) రకానికి రూ. 2,203, సాధారణ రకానికి రూ. 2,183  చెల్లించి  ధాన్య్యాన్ని  కొనుగోలు చేయుటకు సిద్ధంగా ఉన్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  వేసవిని దృష్టిలో పెట్టుకొని రైతుల సౌకర్యార్థం టెంట్లు, మంచి నీటి సౌకర్యం  కల్పించాలన వివరించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్,  వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, సంబంధిత అధికారులు ఉన్నారు.