రైతులు అధికారులు చెప్పిన పంటలు వేయాలి

రైతులు అధికారులు చెప్పిన పంటలు వేయాలి

అద్భుతాలు సృష్టించగల ఏకైక రంగం వ్యవసాయరంగని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. కరోనాతో అన్ని రంగాలు మూలనపడ్డా వ్యవసాయం ఆగలేదన్నారు. ఒకప్పుడు ఏం పాపం చేశాడో సేద్యం చేస్తున్నాడు అనేవారని…ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయన్నారు. వ్యవసాయంలో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు.

గత యాసంగిలో 39 లక్షల ఎకరాల్లో వరి సాగయితే ఈ యాసంగిలో దాదాపు 50 లక్షల ఎకరాలల్లో సాగయిందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సాంప్రదాయ పంటలు వీడి రైతులు పండ్లు, కూరగాయల వంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని తెలిపారు. త్వరలోనే రైతులను ఇతర రాష్ట్రాలకు పంటల పరిశీలనకు అధ్యయనానికి పంపుతామన్నారు. 2,3 ఎకరాలలో మల్బరీ సాగుతో కర్ణాటక రైతులు భారీగా లాభాలు అర్జిస్తున్నారని చెప్పారు. రైతాంగానికి వ్యవసాయంలో మెళకువలు తెలిపి వారిని ప్రోత్సహించేందుకే రైతు వేదికలు ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలని సూచించారు.

ప్రభుత్వం తన వంతు బాధ్యతగా రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటుతో పాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతోందన్నారు. రైతులు చేయవలసిందల్లా సాంప్రదాయ పంటలను పక్కన పెట్టి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడమేనని తెలిపారు మంత్రి. వానాకాలం, యాసంగిలో వ్యవసాయ శాఖ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం పంటలు సాగు చేయించేందుకు వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు.

రైతులు అధికారుల సూచనల ప్రకారం పంటలు సాగు చేయాలని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భూములతో పోలిస్తే పక్క రాష్ట్రాలలో దిగుబడులు తక్కువ వస్తాయన్నారు. రైతులు చేయాల్సిందల్లా అధికారుల సూచనలు పాటించడమేనన్నారు. రైతువేదికలను సద్వినియోగం చేసి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం అధికారుల బాధ్యత .. పాటించడం రైతుల బాధ్యత అని చెప్పారు.