అకాల వర్షం.. రైతుల అయోమయం కొనుగోలు కేంద్రాల వద్ద తడుస్తోన్న ధాన్యం

 అకాల వర్షం..  రైతుల అయోమయం కొనుగోలు కేంద్రాల వద్ద తడుస్తోన్న ధాన్యం
  • టార్ఫాలిన్లు ఇబ్బందులు పడుతున్న రైతులు 

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి వెలుగు: మెదక్​జిల్లాలో అల్పపీడనం కారణంగా రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దకు చేర్చిన ధాన్యం తడిసిపోతుంది. మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​యార్డులో, పిల్లికొటాల్, డబుల్​ బెడ్​ రూమ్​ కాలనీలో, మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లి, మల్కాపూర్​ తండా తదితర కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. 

కొల్చారం మండలం రాంపూర్​ వద్ద నేషనల్​హైవే మీద ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబోసి అవి ఎండేసరికి మళ్లీ వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితి వల్ల ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం ఎండకపోవడం వల్ల మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి 40 టార్ఫాలిన్లు ఇస్తామని అధికారులు చెప్పినా చాలా చోట్ల ప్రారంభించలేదు. దీంతో రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల వారిపై అదనపు భారం పడుతోంది. మరోవైపు వర్షాల వల్ల వరి కోతలకు సైతం ఆటంకం కలుగుతోంది. 

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. సంగారెడ్డి, సదాశివపేట, మునిపల్లి, కోహీర్, జహీరాబాద్, న్యాల్కల్, నారాయణఖేడ్, నాగలిగిద్ద, మండలాలోని కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 27 లేదా నవంబర్ 3న చాలా ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల 5,548 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, 4,706 మంది రైతులు నష్టపోయారు. ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట పట్టణంతో పాటు దుబ్బాక, తొగుట, బెజ్జంకి, కోహెడ, హుస్నాబాద్, చేర్యాల, జగదేవ్ పూర్ మండలాల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలతో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యం అమ్ముకోవడానికి ఓ వైపు రైతులు పడిగాపులు పడుతుంటే మరోవైపు అకాల వర్షం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో రోడ్లపై ఆరబెట్టుకుంటున్న ధాన్యం రాశులు వర్షానికి తడిసిపోతున్నాయి. 

తడిసిన వడ్లను ఆంక్షలు లేకుండా కొనాలి 

హుస్నాబాద్: తడిసిన వడ్లను ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్​కు శాశ్వత కార్యదర్శిని తక్షణమే నియమించాలన్నారు.  శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తడిసిన వడ్లను పరిశీలించి, అక్కడ పడిగాపులు గాస్తున్న రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ సూపర్​వైజర్​గంగారంనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవేందర్ రెడ్డి, సమ్మయ్య, అనంతస్వామి, నాగార్జున్, వెంకటేశ్, రాజేందర్ చారి, నరేశ్, రాజేశ్, రమణ పాల్గొన్నారు.