సర్కారు కొనలే.. కల్లాల మీదనే వడ్లు తడిసిపోయినయ్​

సర్కారు కొనలే.. కల్లాల మీదనే వడ్లు తడిసిపోయినయ్​
  • వర్షాలకు మరోసారి నష్టపోయిన రైతులు
  • వడ్లను కొనకుండా లేట్​ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • కొనుగోలు సెంటర్లలో టార్పాలిన్లూ కరువే
  • టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో.. గడ్డికుప్పలు కప్పిన రైతులు
  • ఇప్పటికే మిల్లర్ల తేమ కొర్రీలు.. ఇప్పుడింకా ఇబ్బంది పెట్టే చాన్స్

హైదరాబాద్/నెట్వర్క్, వెలుగునెల రోజుల కిందట చేతికొస్తున్న టైంలో పంటను దెబ్బతీసినయ్​ వానలు. పొలాలు వరదలో మునిగి రైతులు మస్తు నష్టపోయిన్రు. ఎంతో కొంత చేతికొచ్చిన ధాన్యాన్నైనా అమ్ముకుందామంటే.. సర్కార్​ కొనకుండా లేట్​ చేసింది. ఇప్పటికీ కొన్ని చోట్ల రైతులు వారాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. చేతికొచ్చిన పంటను కొనుగోలు సెంటర్లకు తీసుకెళ్తున్న రైతులు.. అక్కడే పడిగాపులు కాస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు కనీసం కొనుగోలు సెంటర్లలో టార్పాలిన్లనూ ఇవ్వలేదు. కొందరు రైతులు కోసిన పంటను కల్లాల్లోనే కుప్పలుగా పెట్టారు. అయితే, కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం వల్ల.. ఇప్పుడు వర్షాలకు ఆ ధాన్యమంతా తడిసిపోయింది. కొన్ని చోట్ల వడ్లు తడవకుండా గడ్డి కుప్పలనే టార్పాలిన్లలా కప్పారు రైతులు. ఇప్పటికే తేమ శాతం అంటూ కొర్రీలు పెడుతున్న మిల్లర్లు.. ఇదే అదునుగా ఏడ కోతలు పెడతరోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు.

టార్పాలిన్లు తెచ్చేలోగానే..

నివర్​ తుఫాన్​ కారణంగా రెండ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. సన్నొడ్లకు సర్కారు బోనస్​ ఇస్తుందన్న ఆశతో చాలా మంది రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని కుప్పలు పోశారు. సడన్​గా వచ్చిన వర్షంతో రైతులు అలర్ట్​ కాలేకపోయారు. టార్పాలిన్లు తెచ్చే కప్పేలోగానే చేతికి అంది వచ్చిన ధాన్యమంతా తడిసిపోయింది. చాలాచోట్ల కోతకొచ్చిన పంటలు నేలవాలాయి. కోసిన మెదలు తడిసిపోయాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో వందలాది ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో రోడ్ల మీద కిలోమీటర్ల కొద్దీ ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి ఐకేపీ సెంటర్​లో టార్పాలిన్లు తెచ్చేలోపు పంట తడిసిందని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. వర్షంతో సిద్దిపేట, ఖమ్మం, వరంగల్​ రూరల్​, మహబూబాబాద్​, జనగాం తదితర జిల్లాల్లో ఐకేపీ సెంటర్ల పరిధిలో వడ్లకుప్పలు తడిసిపోయాయి. వరంగల్​ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్​లో వడ్లు, మక్కలు నీట మునిగాయి. మెదక్​ జిల్లా పరిధిలో, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, , మద్దిరాల, నాగారం మండలాల్లోని ఐకేపీ సెంటర్లలో టార్పాలిన్లు లేక వడ్లు తడిచాయి. శుక్రవారం సాయంత్రం వరకు మబ్బుపట్టి ఉండడం, వర్షం కురుస్తుండడంతో రైతుల్లో మరింత ఆందోళన కనిపిస్తోంది.

కొన్నది 20 లక్షల టన్నులే..

వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 75 లక్షల టన్నుల ధాన్యం కొనాలని టార్గెట్​ పెట్టుకోగా  గురువారం  వరకు కొన్నది కేవలం 19.21 లక్షల టన్నులే. వర్షం ఎఫెక్ట్​తో చాలా ప్రాంతాల్లో కొనుగోళ్లు ఆగాయి. తుఫాన్​ ప్రభావం లేని ప్రాంతాల్లోనే కొనుగోలు చేస్తున్నట్టు సివిల్​ సప్లయ్స్​ అధికారులు చెబుతున్నారు. వడ్ల కుప్పలను వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. కొనుగోళ్లు లేట్​గా స్టార్ట్​ చేయడం, స్పీడ్​గా కాంటాలు పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల నెల దాటినా కాంటాలు పెట్టట్లేదంటే సర్కార్​ నిర్లక్ష్యం ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నెలవుతున్నా కాంటా పెట్టలె

శివ్వంపేట సొసైటీ దగ్గర పెట్టిన కొనుగోలు కేంద్రానికి నెల కిందట వడ్లు తెచ్చిన. ఇప్పటిదాకా కాంటా పెట్టలె. టార్పాలిన్లు అడిగితే లేవన్నరు. రోజుకు రూ.120 కిరాయి పెట్టి పర్దాలు తెచ్చుకున్నం. నెల రోజుల నుంచి చలికి వణుకుతూ సెంటర్లోనే వడ్ల కుప్ప దగ్గర కాపలా పండుకుంటున్నా ఎవరూ పట్టించుకుంటలేరు.

– ఇ. వీరేశ్​, రైతు, శివ్వంపేట, మెదక్​