రైతన్నకు వరిగోస: వడ్లు కొనాలంటూ ఆందోళనలు

రైతన్నకు వరిగోస: వడ్లు కొనాలంటూ ఆందోళనలు

కొనుడు లేటాయె వానకు నానవట్టె.. 
సర్కారు లెక్కల ప్రకారమే ఇంకా కల్లాలు, సెంటర్లలో 19 లక్షల టన్నుల వడ్లు
నెలన్నర అవుతున్నా పూర్తి కాని కొనుగోళ్లు
మొగులైతే చాలు భయపడుతున్న రైతులు
ఐకేపీ సెంటర్లలో వడ్ల కుప్పల దగ్గర ఇంటిల్లిపాది పడిగాపులు
మొలకెత్తిన ధాన్యం రోడ్డు మీద పోసి నిరసనలు
వడ్లు కొనాలంటూ ఆందోళనలు, రాస్తారోకోలు

నెట్​వర్క్​, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లలో సర్కారు జాప్యం వల్ల రైతుల కష్టం నీళ్ల పాలవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ఐకేపీ సెంటర్లలో వడ్లు నాని, మొలకెత్తుతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని చోట్ల కుప్పలపై కప్పేందుకు బార్దాన్లు లేక.. నింపేందుకు సంచులు కూడా లేక తిప్పలు పడుతున్నారు. వారాల తరబడి తమ వడ్లను కాంటా వేస్తలేరని, ఇప్పుడు వానలకు తడిసిపోతున్నాయని అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొనుగోళ్లలో ఆలస్యాన్ని నిరసిస్తూ గురువారం చాలా జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. రాస్తారోకోలు, నిరసనలు చేపట్టారు. తడిసిన వడ్లను రోడ్ల మీద పోసి తమ గోస చెప్పుకున్నారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని, ఎలాంటి  కోతలు లేకుండా తడిసిన వడ్లను కొనాలని డిమాండ్​ చేశారు. పలు సెంటర్లలో కాంటా పెట్టిన వడ్లను కూడా  రైస్​మిల్లులకు తరలించడం లేదు. దీంతో వర్షం పడినప్పుడల్లా వడ్లు, సంచులు తడిసిపోతున్నాయి. ఇంకొన్ని చోట్ల సీరియల్​ ప్రకారం కాకుండా లీడర్ల అనుచరులవి ముందుగా కొని తమ వడ్లు కొనడం లేదని రైతులు అంటున్నారు. వానాకాలం దగ్గరపడుతుండటంతో ఇంకా ఎప్పుడు పంట పనులు మొదలు పెట్టుకోవాలని, వారాలకు వారాలు వడ్లు అమ్ముకునేందుకే మార్కెట్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. 
రెక్కల కష్టం వాన పాలైంది
మా రెక్కల కష్టం వాన పాలైంది. పది రోజుల కింద వడ్లను తెచ్చి ఐకేపీ సెంటర్ కు వస్తే ఇక్కడ పట్టించుకునేటోళ్లే లేరు. మూడు రోజుల కింద ఖాళీ సంచులు ఇచ్చిన్రు. వడ్లు సంచుల్లో నింపి పెట్టినా లారీలు రాలేదని కాంటా పెట్టలేదు. లారీల కోసం ఎదురుచూస్తుంటే  పెద్ద వానపడి వడ్లు తడిసిపోయినయ్​. 

‑ పల్లాటి భాస్కర్, రైతు, తోర్నాల, సిద్దిపేట జిల్లా       

మహబూబాబాద్​ జిల్లా కురవి మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్​లో వర్షానికి తడుస్తున్న వడ్లు దాదాపు  87% వడ్లు కొన్నామని, నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని, ఆగం కావద్దని సీఎం కేసీఆర్​ వారం కింద చెప్పినా.. ఇంకా మార్కెట్లలో వడ్లు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడాల్సి వస్తోంది. 
కష్టమంతా నీటిపాలు
బుధవారం రాత్రి, గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మార్కెట్లలోకి తెచ్చిన వడ్లు తడిసిపోయాయి. టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. సంచుల్లో నింపిన వడ్లు కూడా మొలకెత్తాయి. వడ్లను కాంటా వేయించేందుకు ఇంటిల్లిపాది మార్కెట్లలోనే ఉండాల్సి వస్తోందని, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదని చాలా ప్రాంతాల్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షాలకు వడ్లు తడిసిపోయాయని, తడిసిన వడ్లను కొనడం లేదని వారు చెప్పారు. 
మే మూడో వారంలో పూర్తికావాల్సింది!
ఈ యాసంగిలో రాష్ట్రంలో మొత్తం 1.25 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చింది. ఇందులో 95 లక్షల టన్నుల వడ్లు కొనాలని సర్కారు లక్ష్యంగా  పెట్టుకుంది. ఏప్రిల్​ రెండోవారంలో కొనుగోళ్లు ప్రారంభించగా గురువారం వరకు  76 లక్షల టన్నుల వడ్లను కొన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే  ఇంకా ప్రభుత్వం కొనాల్సింది  19 లక్షల టన్నులు. వీటిని ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి. వాస్తవానికి ఏటా మార్చి చివరి వారంలో యాసంగి వడ్ల కొనుగోళ్లు ప్రారంభించి మే మూడో వారం వరకు పూర్తి చేస్తుంటారు. కానీ ఈసారి కొనుగోళ్లపై సర్కారు నిర్ణయం తీసుకోవడానికే మార్చి చివరి వారం పట్టింది. దీంతో కొనుగోలు సెంటర్ల ఏర్పాటు లేటైంది. సెంటర్లలో, మిల్లుల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. 
ఎక్కడికక్కడ నిరసనలు
వడ్ల కొనుగోళ్లలో ఆలస్యాన్ని, అధికారుల తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా తోర్నాల, పుల్లూరు గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. పుల్లూరు వద్ద దాదాపు మూడు గంటలకు పైగా రాస్తా రోకో నిర్వహించినా అధికారులు ఎవరూ అక్కడికి రాలేదు. సిద్దిపేట రూరల్ ఎస్​ఐ శంకర్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. తడిసిన వడ్ల కొనుగోలుపై తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని రైతులు చెప్పడంతో సంబంధిత అధికారులతో ఎస్​ఐ ఫోన్​లో మాట్లాడి శాంతింపజేశారు. తోర్నాల వద్ద మెదక్ రోడ్డు పై దాదాపు గంటకు పైగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎలాంటి కోతలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో రైతులు మెదక్​–  సిద్దిపేట మెయిన్​ రోడ్డుపై  బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా ముండ్ల కంపలు పెట్టి ఆందోళన చేపట్టారు. ఇంచుమించు 30 లారీల వడ్లు కొనుగోలు సెంటర్​లో  ఉన్నాయని, అవి ఎండకు ఎండుతూ.. వానకు నానుతున్నా సెంటర్ నిర్వాహకులు కాంటా పెట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా పెట్టిన వడ్లను కూడా  రైస్​మిల్లుకు తరలించడం లేదని, దీంతో వర్షం పడినప్పుడల్లా వడ్లు, సంచులు తడిసిపోతున్నాయని చెప్పారు. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల వద్ద తూప్రాన్​   నర్సాపూర్​ రోడ్డుమీద కూడా రైతులు రాస్తారోకో  చేపట్టారు.  సెంటర్​ నిర్వాహకులు సీరియల్​ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన వారి వడ్లు కాంటా పెడుతూ చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 
 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం కురిసిన వర్షాలు అన్నదాతలను ఆగం జేశాయి.  కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు నీటిపాలయ్యాయి. వర్షానికి వడ్లు మొలకెత్తాయి. టార్పాలిన్లు కప్పినా భారీ వర్షానికి ప్రయోజనం లేకుండాపోయింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెలన్నరైనా ఇంకా వడ్లు కొనకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ ఏనుమాములలో పెద్దసంఖ్యలో మిర్చి బస్తాలు తడిసిపోయాయి. ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లోనూ వర్షానికి మార్కెట్లలోని వడ్లు తడిసిపోయాయి. ముదిగొండ మండలంలో వడ్ల బస్తాలు తడిచి విత్తనాలు మొలకెత్తాయి. రైతులు వడ్లను రోడ్డు మీదికి తెచ్చి ఆందోళనకు దిగారు. జిల్లాలోని తల్లాడ, కామేపల్లి, సత్తుపల్లి, మేంసూరు, కొణిజర్ల, తల్లాడ, వైరా  తదితర మండలాల్లోని కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడిసిపోయాయి. యాదాద్రి జిల్లా రాజాపేట ఎమ్మార్వో ఆఫీసు ముందు రైతులు ధర్నా చేశారు. ఆఫీసు ముందు వడ్లు పోసి నిరసన తెలిపారు. నెలలుగా ఐకేపీ  కేంద్రాల్లో వడ్లతో పడిగాపులు కాస్తున్నా కాంటాలు కావడం లేదని, కాంటాలు అయిన వడ్లు రోజుల తరబడి సెంటర్లలోనే ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయని వారు అన్నారు.  సిబ్బందిని,అధికారులను ప్రశ్నిస్తే  మిల్లుల్లో వడ్లు అన్ లోడ్ కావట్లేదని, లారీలు రావట్లేదని చెప్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు వానలకు వడ్లు తడిశాయి.  వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా చండూరు మండలంలోని స్థానిక చౌరస్తా, రైతు సహకార సంఘం, తహసీల్దార్ ఆఫీసు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు  సెంటర్లకు వడ్లను తెచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కొనలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

వాటర్​ ట్యాంక్​ ఎక్కిన రైతులు
తాము తెచ్చిన వడ్లను కొనకుండా వ్యాపారం చేసే వాళ్ల వడ్లను కొనడాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా గుండాల మండలం నూనెగూడెం రైతులు గురువారం మధ్యాహ్నం వాటర్​ ట్యాంక్​ ఎక్కారు. తమ వడ్లు కొనేదాకా దిగబోమంటూ ట్యాంక్​ మీదే కూర్చున్నారు. నూనెగూడెంలో గత నెలలో వడ్ల కొనుగోలు కోసం సబ్​సెంటర్​ ఏర్పాటు చేసి, లోకల్​ సర్పంచ్​ తూనం రమేశ్​ను ఇన్​చార్జ్​గా నియమించారు. వడ్ల బిజినెస్​ చేసే రమేశ్​ వేరే ప్రాంతాల్లో తక్కువ రేటుకు కొన్న వడ్లను నూనెగూడెం సెంటర్​లో కాంటా పెట్టిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ రకంగా నెలరోజుల్లో 15 లారీల వడ్లను సర్పంచ్​ అమ్మాడని వారు అన్నారు. తమ వడ్లను కాంటా పెట్లాలని అడిగితే  బార్దాన్​ లేదంటూ చెప్పేవాడని, చివరకు విషయం తెలిసి పీఏసీఎస్​ చైర్మన్​కు చెప్పినా పట్టించుకోలేదని రైతులు మండిపడ్డారు. నెల రోజుల నుంచి సెంటర్లలో ఉన్న తమ వడ్లను కొనాలని డిమాండ్​ చేస్తూ కొందరు రైతులు వాటర్​ ట్యాంక్​ ఎక్కగా.. మరికొందరు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. ట్యాంక్ నుంచి కిందకు​ దిగలేదు. అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి  ఫోన్​లో మాట్లాడి.. శుక్రవారం 5వేల బస్తాలు కాంటా పెట్టిస్తామని హామీ ఇవ్వడంతో రాత్రి 9 గంటలకు రైతులు వాటర్​ ట్యాంక్​ నుంచి కిందికి దిగారు. 

వడ్లను తగలబెట్టి నిరసన
కొనుగోళ్లలో జాప్యాన్ని, అధికారుల తీరును నిరసిస్తూ  నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయ మార్కెట్​ ఎదుట రైతులు వడ్లను తగలబెట్టి నిరసన తెలిపారు. వడ్లను మార్కెట్​కు నెల రోజుల కింద తీసుకురాగా నానా సాకులు చూపి కాంటాలు వేయలేదని రైతులు వాపోయారు.  వర్షాల కారణంగా వడ్లు తడిసిపోయి నష్టపోతున్నామన్నారు. ఎలాంటి తరుగు లేకుండా సరైన మద్దతు ధరను చెల్లించి వడ్లను కొనాలని, లేకపోతే అన్నింటినీ అధికారుల ఎదుటే కాలపెడుతామని చెప్పారు. నెల రోజులుగా వడ్లు కొనకుండా తిప్పలు పెట్టి, వర్షాలు పడే సమయంలో బస్తాకు ఐదు కిలోలు ఎక్కువ తూకం వేస్తేనే కొంటామన్న అధికారుల తీరును నిరసిస్తూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారాం తండాలో రైతులు క్వింటాలు వడ్లను రోడ్డుపైకి తీసుకువచ్చి నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం 
వల్లే ఈ పరిస్థితి
రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి వడ్లు కొనబోమని, మరోసారి కొంటామని వ్యవహరించిన విధానం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ధాన్యం పండుతుంది? ఎలా కొనుగోలు చేయాలి? ఎక్కడ నిల్వ చేయాలి?.. అనే దానిపై ప్రభుత్వం వద్ద ఒక స్పష్టత లేదు. అందుకే జూన్ వచ్చినా ఇంకా కొనుగోళ్లు పూర్తి కాలేదు.  ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాగానే ఉన్నారు. కానీ మా వడ్లు తడిసి మేము ఆగమవుతున్నాం.  - వాకదానా కన్నయ్య,  సర్పంచ్, న్యూలక్ష్మిపురం,  ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా 
రోడ్డుపై వంటావార్పు
మిల్లుల్లో స్థలంలేదని,  తమ కోటా అయిపోయిందని మిల్లర్లు చెప్పడంతో ఆగ్రహించిన  నారాయణపేట జిల్లా మద్దూరు రైతులు రోడ్డు మీద  వంటావార్పు చేపట్టారు. మొత్తం 650 ట్రాక్టర్ల లో  ఉన్న వడ్లను రోడ్డుపై ధారపోస్తామని, పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని హెచ్చరించారు. వడ్లను కొనాల్సిందేనని డిమాండ్​ చేశారు.

వెయ్యి సంచులు తడిసినయ్​
నేను యాసంగిలో 22 ఎకరాల్లో వరి పండించిన. వెయ్యి సంచుల వడ్లు ఏప్రిల్​ 10న కొనుగోలు సెంటర్​కు తెచ్చిన. అడుగంగ అడుగంగ ఖాళీ సంచులు ఇచ్చిన్రు. హమాలీలు లేరంటే నేనే రూ. 18 వేలు ఖర్చుపెట్టి కూలీలతో వడ్లు సంచుల్లో నింపిచ్చిన. తూకానికి హమాలీలను, ట్రాన్స్​ పోర్టు కోసం లారీ నేనే తెచ్చుకుంటా అన్నా నా వడ్లు కాంటా పెట్టలేదు. ఇప్పుడు వానకు సంచులన్నీ తడిసిపోయినయ్​.   ‑ పల్వట్ల కిష్టయ్య, రైతు, చిలప్​చెడ్​, మెదక్​ జిల్లా