ఎన్నికల్లో పోటీకి టికెట్ నిరాకరణ.. ఏకంగా CM ఇంటి ముందే ఎమ్మెల్యే ధర్నా

ఎన్నికల్లో పోటీకి టికెట్ నిరాకరణ.. ఏకంగా CM ఇంటి ముందే ఎమ్మెల్యే ధర్నా

పాట్నా: బీహార్‎లో పాలిటిక్స్ పీక్ స్టేజ్‎కు చేరుకున్నాయి. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ఎలక్షన్ పనుల్లో నిమగ్నమైపోయాయి. సీట్ల పంపకం, పొత్తు, అభ్యర్థల ఎంపికపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో అధికార జేడీయూ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. టికెట్ దక్కని నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించడంతో జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నాలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగారు.

తనకు టికెట్ కేటాయించాలంటూ అనుచరులతో కలిసి ఆందోళన చేశాడు. మరోవైపు.. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికలో తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తిగా ఉన్న జేడీయూ ఎంపీ అజయ్ మండల్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. ఇందుకు అనుమతి ఇవ్వాలని నేరుగా సీఎం నితీష్ కుమార్‎కే లేఖ రాశారు.

మరికొందరు జేడీయూ నాయకులు కూడా టిక్కెట్లు నిరాకరించినందుకు పాట్నాలోని సీఎం ఇంటి ముందు నిరసనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు, సీఎం భద్రతా సిబ్బంది.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. టికెట్ల కోసం జేడీయూ నేతలు ఏకంగా సీఎం ఇంటి ముందే నిరసనకు దిగడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఎన్డీఏ కూటమిలో భాగమైన జేడీయూకు సీట్ల పంపకంలో భాగంగా 101 స్థానాలు లభించిన విషయం తెలిసిందే. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీహార్‎లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2025, నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్, 11న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజులు ఫలితాలు వెల్లడించనున్నారు.