పంట అమ్మకానికి 50 కిలోమీటర్ల నడక

పంట అమ్మకానికి 50 కిలోమీటర్ల నడక
  • మండుటెండలో హైవేలపై రైతుల ప్రయాణం
  • ఊళ్లో మంచి ధర రాకపోవడంతో పట్టణాలకు

తిరుచ్చి: దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలులో ఉండటంతో చేతి కొచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులే వ్యాపారులుగా మారుతున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, కూరగాయలు, పండ్లు పండించే వారు దగ్గరలోని నగరాలు, పట్టణాలకు వెళ్లి ఇంటింటికీ తిరిగి వాటిని అమ్ముతున్నారు. వెహికల్స్​ తిరగకపోవడంతో వీరందరికీ సరుకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేరళలో కొంత మంది తలపై మూటనెత్తుకుని దాదాపు 25 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన మార్కెట్లలో తమ సరుకు అమ్ముకుని మళ్లీ కాలినడకనే తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళా రైతులే ఉంటున్నారు. పండించిన పంటకు మంచి రేటు వస్తుందనే కారణంతో మండే ఎండలో నేషనల్​ హైవే మీదుగా వీరంతా పట్టణాలకు చేరుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. ‘‘మరో ముగ్గురితో కలిసి నేను ఆకుకూరలు పండిస్తాను. వాటిని గాంధీ మార్కెట్​లో అమ్ముతాను. లాక్​డౌన్​ కారణంగా బస్సులు, ఆటోలు తీరగడం లేదు. దాని వల్ల మేము సిటీకి రాలేకపోతున్నాం. మా ఊళ్లోనే వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. కానీ గిట్టుబాటు ధర రావడం లేదు. కొందరైతే అసలు కొనడమే లేదు. కొంచెం వ్యాపారమైనా నడుస్తుందనే నమ్మకంతో మేము సిటీకి వస్తున్నాం”అని మనాచెన్నలూరులోని కోనలై గ్రామానికి చెందిన మరియమ్మ చెప్పింది. తెల్లవారు జామున ఒక టీమ్​గా వీరంతా బయలుదేరి 23 కిలోమీటర్లు నడిచి గాంధీ మార్కెట్​, చాతిరం మార్కెట్లలో కూరలు అమ్ముతారు. ఎండ కాస్త తగ్గిన తర్వాత తాము ఇండ్లకు బయలుదేరుతున్నామని, చీకటి పడకముందే ఇంటికి చేరుకుంటున్నామని మరియమ్మ చెప్పింది. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు ట్రాన్స్​పోర్ట్ సదుపాయం కల్పించాలని ముసిరికి చెందిన వ్యాపారి రాజేంద్రన్​కోరాడు. అయితే తిరుచ్చి జిల్లా కలెక్టర్​ ఎస్. శ్రీనివాసు మాత్రం వ్యాపారులు తమకు దగ్గరలోని పట్టణాల్లో షాపులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.