రీజినల్​ రింగ్​ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు

రీజినల్​ రింగ్​ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
  • భూమి గుంజుకుంటే చావే దిక్కు
  • రీజినల్​ రింగ్​ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
  • భూమి తీసుకోవద్దని కన్నీరు పెట్టిన మహిళా రైతులు
  • భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్

మెదక్/శివ్వంపేట, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్ సర్వేను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ భూమి గుంజుకోవద్దని తహసీల్దార్​ ఎదుట మహిళా రైతులు కన్నీరు పెట్టారు. భూమికి బదులు భూమి ఇస్తామంటేనే ఒప్పుకుంటామని లేదంటే ప్రాణాలు పోయినా సరే భూమి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల్లో నుంచి రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సర్వే చేసేందుకు బుధవారం తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఆర్ఐ కిషన్, సర్వేయర్ అనురాధ వెళ్లగా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. ఉన్నకొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఈ భూములు పోతే తమ బతుకుదెరువు ఎలాగని ప్రశ్నించారు. తమ పిల్లలు చదువుకుంటున్నారని, కొందరు ఆడపిల్లలకు పెళ్లీడు వచ్చిందని, ఉన్న కొద్దిపాటి భూమి పోతే, వాళ్లను ఎలా చదివించాలని, పెళ్లిళ్లు ఎలా చేయాలని నిలదీశారు.  

భూములు గుంజుకుంటే కుటుంబసభ్యులందరం కలిసి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో దారి లేదని కంటతడి పెట్టారు. ప్రాణాలు పోయినా సరే భూమి మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. పక్కనే ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, అందులో నుంచి రోడ్డు నిర్మించకుండా, తమ పట్టా భూముల్లో నుంచి వేయడం ఏంటని ప్రశ్నించారు. ఏదో కొంత పరిహారం ఇచ్చి భూములు తీసుకుంటామంటే ఒప్పుకోబోమని, భూ సేకరణ తప్పనిసరి అయితే భూమికి భూమి ఇవ్వాలని డిమాడ్​ చేశారు. ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడికి రావొద్దని సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లకు తేల్చిచెప్పారు.