సన్నవడ్ల సాగుతో రైతులకు మస్తు నష్టాలు.!

సన్నవడ్ల సాగుతో రైతులకు మస్తు నష్టాలు.!
  •     సర్కారు పిలుపుతో 24 లక్షల ఎకరాల్లో సాగు
  •     చీడపీడలతో పెరిగిన పెట్టుబడులు
  •     ఎకరాకు  రూ.10 వేలకు పైగా అదనపు ఖర్చు
  •     దొడ్డు రకాలతో పోలిస్తే తగ్గిన దిగుబడులు
  •     మద్దతు ధరపై సర్కారు నుంచి నో క్లారిటీ

నెట్వర్క్/పెద్దపల్లి, వెలుగుసర్కారు చెప్పిందని సన్నవడ్లు సాగు చేసిన రైతులకు చీడపీడల రూపంలో కష్టాలు, మద్దతు ధర లేక నష్టాలు తప్పేలా లేవు. దొడ్డు రకాలతో పోలిస్తే సన్నవరి సాగుచేసిన రైతులు ఎకరాకు  రూ.10 వేలకు పైగా అదనపు ఖర్చు చేసినా 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి తక్కువగా వస్తోంది. తీరా దొడ్డు రకాలతో పోలిస్తే సన్నరకాలకే మద్దతు ధర రూ.20  తక్కువగా ఉండడంతో  తమకు గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. షరతుల సాగులో భాగంగా తమతో సన్నవడ్లు సాగు చేయించిన సర్కారు క్వింటాల్​కు కనీసం రూ.500 బోనస్​ ప్రకటించి నష్టాల నుంచి బయటపడేయాలని కోరుతున్నారు.

20 లక్షల ఎకరాల్లో సాగు

ఈ వానాకాలం సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన టీఆర్ఎస్​ సర్కారు, షరతుల సాగు కింద 65 లక్షల ఎకరాల్లో పత్తి, 42 లక్షల ఎకరాల్లో వరి ప్రధానంగా పండించాలని నిర్ణయించింది. వరిలో  40 శాతం సన్నరకాలు సాగయ్యేలా చూడాలని అగ్రికల్చర్​ ఆఫీసర్లను ఆదేశించింది. కానీ అంచనాకు మించి రైతులు సుమారు 52 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. కానీ ఇటు అధికారుల ఒత్తిడి, అటు రైతుబంధు రాదేమోననే భయంతో తమకు ఇష్టం లేకపోయినా సుమారు 24 లక్షల ఎకరాల్లో బీపీటీ(సాంబమసూరి), తెలంగాణ మసూరి లాంటి సన్నాలు సాగు చేశారు.

పెరిగిన పంటకాలం, పెట్టుబడి

దొడ్డు రకాలతో పోలిస్తే సన్నరకాల పంట కాలం ఎక్కువ. దొడ్డు రకాలు 3 నుంచి 4 నెలల్లో కోతకు వస్తే, సన్నరకాలు 5 నెలలు గడిస్తే గానీ చేతికి రావు. వివిధ జిల్లాల్లో ఇప్పటికే దొడ్డురకాలు కోతకు వస్తుండగా, సన్నరకాలు ఇంకా కోతకు రాలేదు.  ఇందుకు మరో 20 నుంచి 30 రోజులు పట్టే చాన్స్​ ఉంది. ప్రస్తుత అకాల వర్షాల ఎఫెక్ట్​ సన్నవరిపైనే ఎక్కువ ఉంది. గాలివానకు వరి నేలవాలి నష్టం జరుగుతోంది. ఈ సీజన్​లో మొదటి నుంచీ అధిక వర్షాల కారణంగా సన్నరకాలను చీడపీడలు ఎక్కువగా ఆశించాయి. వరి పొట్ట దశ నుంచే కంకినల్లి లాంటి తెగుళ్లు, దోమపోటు రావడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు ఇప్పటివరకు మూడు నుంచి నాలుగుసార్లు పురుగుల మందు స్ప్రే చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల లాంటి జిల్లాల్లో ఒక్కో ఎకరానికి పురుగు మందులపైనే రూ.10 వేల వరకు అదనంగా ఖర్చు చేశామని రైతులు అంటున్నారు. ఇప్పటికీ పంట కోతకు రాకపోవడంతో మరోసారి పురుగు మందులు స్ప్రే చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

దిగుబడి తక్కువ.. మద్దతూ తక్కువే

ప్రతి ఎకరాకు దొడ్డు రకాలతో పోలిస్తే  సన్నరకాల దిగుబడి నాలుగైదు క్వింటాళ్లు తక్కువగా ఉంటుంది. ఎలాంటి చీడపీడలు లేకుంటే దొడ్డురకం ధాన్యం ఎకరానికి 30 నుంచి35 క్వింటాళ్లు వస్తే సన్న ధాన్యం ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు వస్తుంది. ప్రస్తుతం తెగుళ్లు ఎక్కువగా ఉండడంతో సన్నరకం ప్రతి ఎకరాకు 20 క్వింటాళ్ల లోపే వచ్చే చాన్స్​ఉందని రైతులు చెబుతున్నారు. కానీ కేంద్రం ప్రకటించిన మద్దతు ధర మాత్రం దొడ్డు రకాలకు ఎక్కువగా, సన్న రకాలకు తక్కువగా ఉంది.  గ్రేడ్​ ‘ఏ’ వడ్ల ధర క్వింటాల్​కు రూ. 1,888 కాగా, సాధారణ రకానికి రూ. 1,868 చెల్లించాలని నిర్ణయించింది. సహజంగా దొడ్డు వడ్లు గ్రేడ్​ ఏ కిందికి, సన్నవడ్లు సాధారణ కేటగిరీ కిందికి వస్తాయి.  గత వానాకాలం సీజన్​లో మద్దతు ధరలకు మించి సన్నాలకు మార్కెట్​లో క్వింటాల్​కు రూ.2 వేల దాకా పలికింది. అప్పట్లో ప్రొడక్షన్​తక్కువగా ఉండి డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు సన్నాలకు రూ.2 వేల వరకు చెల్లించారు. కానీ ఈసారి షరతుల  విధానంలో సన్నాలు సాగు చేయించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ప్రతి గింజనూ తానే కొంటానని చెబుతోంది. కానీ మద్దతు ధర చెల్లిస్తే తమకు గిట్టుబాటు కాదని, ప్రతి క్వింటాల్​కు రూ.400 నుంచి రూ.500 వరకు అధికంగా చెల్లించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే సన్నరకాలు సాగు చేసిన పాపానికి ప్రతి ఎకరాకు కనీసం రూ.20 వేల చొప్పున నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ రేటుకు కొనాలె

ఈ ఏడాది సర్కార్​ చెప్పిందని సన్న వడ్లు పెట్టిన. వానలు బాగపడి తెగుళ్లు, దోమపోటు వచ్చింది. ఇప్పటికి ఐదుసార్లు మందులు కొట్టిన. ఎకరానికి రూ. 3 వేలు అదనంగా ఖర్చుపెట్టిన. ఇప్పుడు దొడ్డు రకాలకు, సన్న రకాలకు ఒకటే రేటంటే కష్టం. సన్నవడ్లను ఎక్కువ రేటుకు కొనాలె. కనీసం రూ.500 ఎక్కువియ్యాలె.

– సంపత్​ రెడ్డి,తుర్కలమద్దికుంట, పెద్దపల్లి జిల్లా

దిగుబడి తగ్గింది

ఎప్పుడూ దొడ్డు రకాలు పెట్టేటోడిని. ఈసారి సర్కారు చెప్పిందని సన్న వడ్లు సాగు చేసినం. దొడ్డు వడ్లకు రోగమంటె తెల్వది. ఎకరానికి 35 క్వింటాళ్ల దాక పండుతయ్. కానీ సన్న వడ్లకు పుట్టెడు రోగాలు వచ్చినయ్​. ఎకరానికి 25 క్వింటాళ్లకంటే ఎక్కువ దిగుబడి రాదు. ఈసారి లాసే.

– ముత్యాల రాజయ్య,తుర్కలమద్దికుంట, పెద్దపల్లి జిల్లా