కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు చాలా ప్రయోజనాలు

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు చాలా ప్రయోజనాలు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు నూతన అవకాశాలను కల్పిస్తాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు నిరసనలకు దిగి 17 రోజులు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో పాల్గొన్న మోడీ.. కొత్త చట్టాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాల వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు.

‘వ్యవసాయ రంగానికి, ఆ సెక్టార్‌‌కు అనుబంధంగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ లేదా కోల్డ్ చైన్‌‌కు మధ్య ఉన్న అడ్డుగోడలను మేం గమనించాం. వాటిని తొలగించాలని భావించాం. వ్యవసాయ రంగంతో పెనవేసుకున్న వాటిని కలపాలనుకున్నాం. ఇప్పుడు అన్ని అడ్డంకులనూ తొలగించాం. కొత్త సంస్కరణలతో రైతులు కొత్త మార్కెట్లు, టెక్నాలజీ ప్రయోజనాలను పొందేందుకు ఆస్కారం లభించింది. కోల్డ్ స్టోరేజ్ ఇన్‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను ఆధునీకరిస్తాం. తద్వారా వ్యవసాయ రంగంలో మరిన్ని ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ను ఆకర్షిస్తాం. దీని వల్ల రైతులు చాలా లబ్ధి పొందుతారు’ అని మోడీ పేర్కొన్నారు.