
- పెట్టుబడుల పేరుతో 200 మందిని మోసం చేసి 530 కోట్లు వసూలు
- రూ.427 కోట్లు రిటర్న్.. ఆపై బిచానా ఎత్తేసిన ముఠా
- ఇద్దరిని పట్టుకున్న పోలీసులు, 2 కిలోల గోల్డ్, రూ.4 లక్షలు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: చాక్లెట్స్ డీలర్లమని చెప్పుకుని, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ పేరుతో రూ.530 కోట్లకు టోకరా వేసిన ముఠా గుట్టురట్టయింది. ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కిలోల బంగారం, రూ.4లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను బుధవారం సీసీఎస్ డీసీపీ శిల్పవల్లితో కలిసి సిటీ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ మీడియాకు వెల్లడించారు.
రెండు బిజినెస్‌లలో పెట్టుబడులు
విజయవాడకు చెందిన గుధే రాంబాబు(48), భీమవరానికి చెందిన పెన్మెత్స కృష్ణంరాజు(42) కొంత కాలంకింద విజయవాడలో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేశారు. వచ్చిన లాభాలతో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ పేరుతో మరో వ్యాపారం ప్రారంభించారు. లాభాలు వస్తున్నాయని బంధువులు, ఫ్రెండ్స్‌తో తమ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారు. ఏపీ వ్యాప్తంగా, హైదరాబాద్‌లోనూ వ్యాపారాన్ని విస్తరించారు. గచ్చిబౌలిలో ఉంటూ ఆఫీస్ ఓపెన్ చేశారు. పెట్టుబడులు పెట్టిన వారికి ప్రతినెలా 6 శాతం లాభాలు ఇస్తామని ప్రచారం చేసి నమ్మించారు. అలా దాదాపు 200 మంది నుంచి రూ.530 కోట్లు వసూలు చేశారు.
ఆగస్ట్ నుంచి చెల్లించకపోవడంతో..
ఇన్వెస్టర్లు ఇచ్చిన డబ్బు తమ దగ్గరే ఉంచుకుని వారు పెట్టిన పెట్టుబడికి 6 శాతం నుంచి 13 శాతం వరకు లాభాల రూపంలో చెల్లించారు. కొంతమంది ఇన్వెస్టర్ల నుంచి బంగారం కూడా తీసుకున్నారు. మొత్తం సేకరించిన డబ్బులో రూ.427 కోట్ల మేర తిరిగి చెల్లించారు. కంపెనీ నిర్వహణ కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశారు. డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ రూపంలో రూ.12 కోట్లు చెల్లించారు. వసూలు చేసిన డబ్బుతో హైదరాబాద్, విజయవాడలో విలువైన భూములు, ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇన్వెస్టర్లకు ఈ ఏడాది ఆగస్ట్ నుంచి డబ్బులు చెల్లించడం ఆపేశారు. దీంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైట్ కాలర్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాంబాబు, కృష్ణంరాజులను అరెస్ట్ చేశారు.