కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు బస్సులో మంటలు.. 10 మంది మృతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు బస్సులో మంటలు.. 10 మంది మృతి

ఏపీ కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బస్సు మంటల్లో దగ్ధమైపోయింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో పది మంది చనిపోయారు.

 హైదరాబాద్ నుంచి బెంగళూరు  వెళ్తున్న  కావేరి  ట్రావెల్స్ బస్సు.. కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మంది చనిపోగా 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక  చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు సమీపంలోని చిన్నటేకూరులో ఓ బైక్ బస్సును ఢీకొట్టి బస్సు కిందకు దూసుకెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగినట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత మంటలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చాయి. ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు బద్దలు గొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా దాదాపు 12 మంది వరకు ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. 

ప్రమాద సమయంలో అక్కడున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా ఒకరిద్దరు ఈ ప్రమాదంలో గాయపడినవారిని తమ వాహనాల్లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.