అడవి పందులకు పెట్టిన కరెంట్ వైర్లు తగిలి తండ్రీకొడుకులు మృతి

అడవి పందులకు పెట్టిన కరెంట్ వైర్లు తగిలి తండ్రీకొడుకులు మృతి

మెదక్/పెద్ద శంకరంపేట, వెలుగు: అడవి పందుల కోసం పెట్టిన కరెంటు వైర్లు తగిలి తండ్రీకొడుకులు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో శుక్రవారం జరిగింది. పెద్దశంకరంపేట మండలం కోల్లపల్లి తండాకు చెందిన ధరావత్ హర్యానాయక్ (55) పొలం సంగారెడ్డి – నాందేడ్ నేషనల్​హైవే  విస్తరణలో పోయింది. వ్యవసాయం మీద మక్కువతో ఆయన తన పొలం పక్కనే ఉన్న కోల్లపల్లికి చెందిన మరొకరి పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వర్షాలు పడడంతో పొలం ఎలా ఉందో చూద్దామని గురువారం సాయంత్రం వెళ్లారు. పక్క పొలం వాళ్లు అదే సమయంలో అడవి పందుల కోసం కరెంట్ వైర్లు పెట్టారు. ఆ సంగతి తెలియని హర్యానాయక్ నేరుగా వెళుతూ ఆ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పొలానికి వెళ్లిన తండ్రి రాత్రి తొమ్మిదైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు రాజునాయక్(26) బంధువు నవీన్ ను తీసుకుని వెతకడానికి వెళ్లాడు. పొలంలో చెరోవైపు వెతుకుతుండగా తండ్రి కింద పడిపోయి ఉండడం రాజునాయక్ గమనించాడు. కళ్లు తిరిగి పడిపోయాడేమోనని అనుకుని లేపే ప్రయత్నం చేశాడు. దాంతో అతనికి కూడా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన నవీన్ వారిని చూసి వెంటనే ఊళ్లోకి వెళ్లి విషయం చెప్పాడు. గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. హర్యానాయక్ కు రాజు ఒక్కడే కొడుకు కాగా, రాజుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.