బర్త్ డే కేక్ తిని తండ్రీ-కొడుకు మృతి: బాబాయిపైనే అనుమానం

బర్త్ డే కేక్ తిని తండ్రీ-కొడుకు మృతి: బాబాయిపైనే అనుమానం

ఆ బాలుడికి అదే  చివరి పుట్టిన రోజైంది.  ‘ఇవాళ నా బర్త్​డే’ అంటూ రోజంతా  స్నేహితులతో చెబుతూ తిరిగిన ఆ పసిప్రాణం అంతలోనే అనంత వాయువుల్లో కలిసిపోయింది. తన బర్త్​డే కోసం సొంత బాబాయి పంపించిన కేకులో ఏ విషం కలిసిందో  తెలియదుగానీ దాన్ని తిని అభంశుభం తెలియని  తొమ్మిదేళ్ల రాంచరణ్​, అతని తండ్రి ఇస్తారిగల్ల రవి(38) ప్రాణాలు కోల్పోయారు. రాంచరణ్​ అక్క పూజిత(11)  కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది.  రాంచరణ్​ తల్లి భాగ్యలక్ష్మి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రాత్రి10 గంటల తర్వాత ఆ కేకు అందడంతో కుటుంబసభ్యులే తిన్నారుగానీ, ఒకవేళ ఓ గంట ముందే అంది బాలుడి స్నేహితులు కూడా తింటే మరింత ప్రాణనష్టం జరిగేది.

ఇంటి జాగ గొడవతో..

కొమురవెల్లి మండలం ఐనాపూరుకు చెందిన ఇస్తారిగల్ల రవి(38) స్వస్థలం సిద్దిపేట.  ఈయనకు భార్య భాగ్యలక్ష్మి, కూతురు పూజిత, కొడుకు రాంచరణ్ ఉన్నారు. రాంచరణ్​ ఐదోతరగతి, పూజిత ఏడో తరగతి చదువుతున్నారు. రవికి అతని తమ్ముడు  శ్రీనివాస్​కు  సిద్దిపేట పట్టణంలో 80 గజాల ఇంటి స్థలం ఉంది. దీని పంపకాల విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.

ఇది కాస్తా గొడవలకు దారితీయడంతో ఏడాదిన్నర క్రితం రవి కుటుంబసభ్యులతో కలిసి కొమురవెల్లి మండలంలోని తన అత్తగారి గ్రామం ఐనాపూరుకు వలసవచ్చాడు. ఇక్కడే కూలినాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రవి కుమారుడు రాంచరణ్ బుధవారం తన తొమ్మిదో పుట్టిన రోజు జరుపుకున్నాడు. అదేరోజు ఐనాపూరులో బంధువులు మృతి చెందడంతో రవి తమ్ముడు శ్రీనివాస్​ నలుగురు స్నేహితులతో కలిసి అంత్యక్రియలకు వచ్చాడు.

ఆ కార్యక్రమం ముగిశాక  అన్న రవి ఇంటికి చేరుకున్నాడు.  సిద్దిపేటలో ఉన్న ఆస్తి గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో రవి భార్య భాగ్యలక్ష్మి తో శ్రీనివాస్​ వాగ్వాదానికి దిగాడు.  పరిస్థితి సద్దుమణిగాక రవి బుధవారం తన కొడుకు రాంచరణ్​ పుట్టిన రోజు ఉన్న విషయాన్ని తమ్ముడు శ్రీనివాస్​కు చెప్పాడు.

ఇకనైనా గొడవలు మరచిపోదామనీ, తాను సిద్దిపేటకు వెళ్లాక కేకు పంపిస్తానని చెప్పి శ్రీనివాస్​ వెళ్లిపోయాడు.  అక్కడే  ఓ బేకరీలో కేకు తీసుకుని ఐనాపూరుకు వచ్చే నైటాల్ట్​ బస్సులో పంపించాడు. కాగా,  కేకు కోసం రాంచరణ్, అతని స్నేహితులు చాలా సేపు ఎదురుచూశారు. ఎంతకీ రాకపోవడంతో ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.  రవి బస్సు నుంచి కేక్​ తీసుకొని వచ్చేటప్పటికే రాత్రి 10గంటలు కావడంతో రాంచరణ్​ స్నేహితులు, ఇరుగుపొరుగు నిద్రపోయారు.

దీంతో కుటుంబ సభ్యులే ఇంట్లో కేక్​ కట్​చేసి, పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. రాంచరణ్​ కేక్​ కట్​చేయగా ముందుగా కేకును రవి, భాగ్యలక్ష్మి బాలుడికి తినిపించారు. తర్వాత రాంచరణ్​ కేకును తన తండ్రి రవికీ, తన సోదరి పూజితకు తినిపించాడు.  తర్వాత భాగ్యలక్ష్మి కూడా కొద్దిగా తిన్నది. రెండు గంటల తర్వాత రాంచరణ్​ ఒక్కసారిగా కడుపు నొప్పితో కుప్పకూలాడు. అదే సమయంలో రవికి నోట మాట నిలిచిపోయింది.  పూజిత కూడా  పడిపోయింది. దీంతో భాగ్యలక్ష్మి ఇరుగుపొరుగు సాయంతో ముగ్గురినీ హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.

అక్కడ చికిత్సపొందుతూ  రవి, రాంచరణ్ గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన పూజితను హైదరాబాద్​లోని  నీలోఫర్​ ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం  పూజిత కోమా నుంచి బయటపడింది. భాగ్యలక్ష్మి సిద్దిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

విషం పెట్టాడు: కుటుంబీకులు

ఆస్తి తగాదాతోనే  శ్రీనివాస్​ తాను పంపించిన కేకులో విషం కలిపి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నాడని రవి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్​ ఏసీపీ మహేందర్, చేర్యాల సీఐ రఘు, ఎస్​ఐ మోహన్​ రంగంలోకి దిగారు.  శ్రీనివాస్​ సహా మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్ట్​మార్టం నివేదిక వచ్చాకే పూర్తివివరాలు వెల్లడిస్తామని వెల్లడించారు. రాంచరణ్​, రవి మృతదేహాలకు గురువారం పోస్ట్​ మార్టం పూర్తిచేసి ఐనాపూరుకు తరలించారు.