ముప్పారంలో విలేజ్ క్యాబినెట్..గ్రామ పాలనా వ్యవస్థలో సరికొత్త పంథా

ముప్పారంలో విలేజ్  క్యాబినెట్..గ్రామ పాలనా వ్యవస్థలో సరికొత్త పంథా
  • వార్డు సభ్యులకు పని విభజన, శాఖల కేటాయింపు

ధర్మసాగర్, వెలుగు: గ్రామస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ , పని విభజనతో హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలం ముప్పారం గ్రామపంచాయతీలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో గ్రామస్థాయిలో శాఖలు కేటాయించి పని విభజన చేశారు. ప్రజలకు మరింత అందుబాటులో సేవలందించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. 

రిపబ్లిక్  డే సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో జెండా ఆవిష్కరణ అనంతరం గ్రామ సర్పంచ్  గుంటిపల్లి రేణుక సమక్షంలో గ్రామ కార్యదర్శి ఆకారపు సురేశ్​ వార్డు సభ్యులకు శాఖలను కేటాయిస్తూ సంతకాలు తీసుకున్నారు. ముప్పారం గ్రామంలో 12 మంది వార్డు సభ్యులున్నారు. సర్పంచ్ తో కలిపి 13 మంది ఉంటారు. వారి సామాజిక నేపథ్యం, విద్యార్హత, అనుభవం బట్టి శాఖలను కేటాయించారు. 

సర్పంచ్​ శాంతి భద్రతలు, పన్నులు, పంచాయతీ పాలన వ్యవహారాలు చూస్తారు. ఉప సర్పంచ్  తాళ్లపల్లి కుమారస్వామితో పాటు వార్డు సభ్యులకు శాఖలను కేటాయించారు. పశుసంవర్ధక, ఆర్థిక, విద్య, విద్యుత్, మహిళా శిశు సంక్షేమం, అంగన్​వాడీ, వైద్య ఆరోగ్యం, ఆశా వర్కర్లు, రోడ్ల రిపేర్లు, తాగునీరు, డ్రైనేజీ, సాగునీటి వనరులు, చెరువు పరిరక్షణ, మత్స్య సంపద తదితర శాఖలను గుర్తించి కేటాయించారు. రిపబ్లిక్​ డే సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. గ్రామ పెద్దలు, పాలకవర్గం కృషిని అభినందించారు.