ఇండియా విజయాలతో ప్రపంచానికి స్థిరత్వం..యురోపియన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ అధ్యక్షురాలు

ఇండియా విజయాలతో ప్రపంచానికి స్థిరత్వం..యురోపియన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ అధ్యక్షురాలు
  • యురోపియన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌‌‌‌డెర్‌‌‌‌  లెయెన్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా సాధించే విజయాలు.. ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా మారుస్తాయని యురోపియన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌‌‌‌డెర్‌‌‌‌  లెయెన్‌‌‌‌ అన్నారు. దీనివల్ల మనందరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌‌‌‌డెర్‌‌‌‌  లెయెన్‌‌‌‌, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా చీఫ్ గెస్ట్​లుగా హాజరయ్యారు. 

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌‌‌‌ లో నిర్వహించిన పరేడ్‌‌‌‌కు సంబంధించిన వీడియోను ఆమె ‘ఎక్స్‌‌‌‌’ వేదికగా పంచుకుంటూ ఈ మేరకు ట్వీట్‌‌‌‌ చేశారు. ఛబ్బీస్ జనవరి వేడుకలకు చీఫ్ గెస్ట్​గా హాజరుకావడం.. తన జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అస్థిరంగా ఉన్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఇండియా, ఈయూ మధ్య బంధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. 

ఈ పర్యటనలో పెండింగ్‌‌‌‌లో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్​టీఏ) ముగింపు దశకు చేరుకుంటుందని తెలిపారు. కాగా, యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు మన రిపబ్లిక్‌‌‌‌ డే వేడుకలకు చీఫ్ గెస్ట్​లుగా హాజరవడం ఇదే మొదటిసారి. కాగా, గణతంత్ర వేడుకల్లో ఉర్సులా.. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా బంగారు రంగు ఎంబ్రాయిడరీ ఉన్న మెరూన్ కలర్ బనారసి సిల్క్ జాకెట్‌‌‌‌ను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇవాళ మోదీతో ఈయూ నేతల భేటీ

ఢిల్లీలో జరగనున్న 16వ ఇండియా, ఈయూ సదస్సులో చారిత్రక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్​టీఏ)పై అధికారిక ప్రకటన వెలువడనున్నది. ఈయూ నేతలు.. తమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి మంగళవారం ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నారు.

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే కోట్లాదిమంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, ప్రపంచ జీడీపీలో ఇది 25 శాతానికి సమానమని దావోస్ వేదికగా ఉర్సులా ప్రకటించారు. అందుకే ఈ ఒప్పందాన్ని ఆమె ‘‘అన్ని ఒప్పందాలకు తల్లి వంటిది”(మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) అని అభివర్ణిస్తున్నారు. ఈ డీల్ ఫైనల్ అయితే దాదాపు 200 కోట్ల జనాభా ఉన్న మార్కెట్ అనుసంధానం అవుతుంది.