త్రివర్ణ శోభితం.. ఉమ్మడి వరంగల్జిల్లాలో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

త్రివర్ణ శోభితం.. ఉమ్మడి వరంగల్జిల్లాలో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్
  •  జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్లు

77వ గణతంత్ర దినోత్సవాన్ని ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు సత్యశారద, స్నేహా శబరీశ్, రిజ్వాన్​ భాషా షేక్, ​అద్వైత్​ కుమార్​ సింగ్, ​దివాకర, రాహుల్​ శర్మ జెండా ఆవిష్కరణ చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. 

స్వాతంత్ర సమర యోధులను సత్కరించారు. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి, ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్లు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

 బల్దియా హెడ్ ఆఫీస్​లో బల్దియా మేయర్​ గుండు సుధారాణితో కలిసి బల్దియా కమిషనర్​ చాహత్​ బాజ్ పాయ్​ జాతీయ జెండాను ఎగరవేయగా, ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్​ కార్యాలయాలు, స్కూళ్లు, పలు సంఘాలు, ఆఫీస్​ల వద్ద ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు జెండావిష్కరణ చేశారు. ములుగు క్యాంప్​ ఆఫీస్​లో మంత్రి సీతక్క జెండా ఎగురవేశారు.    - వెలుగు, నెట్​వర్క్​

సమగ్రాభివృద్ధే లక్ష్యం

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఆఫీసర్లు అంకిత భావంతో పనిచేయాలని జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. రిపబ్లిక్​ డే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు కోటి 85 లక్షల 97 వేల మంది మహిళలు ప్రయాణించారని, రూ.97 కోట్ల 43 లక్షలు మహిళలకు ఆదా అయిందన్నారు. 

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 39,605 మంది వైద్య సేవలు పొందగా, రూ.88 కోట్ల 13 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఔషధి ద్వారా 1,03,402 మందికి వైద్య సేవలు, 5,690 మంది మహిళలకు ఆరోగ్య మహిళా క్యాంపులు, 65 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మహాదేవపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా 1,24,496 మంది రైతులకు రూ.96 కోట్లు చెల్లించామని చెప్పారు. రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బీమా పథకంలో 72,058 మంది నమోదు చేసినట్లు తెలిపారు.  

అగ్రగామిగా ‘హనుమకొండ’

హనుమకొండ, వెలుగు: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని, అలాగే అన్నింట్లో హనుమకొండ జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నామని కలెక్టర్ స్నేహా శబరీశ్ అన్నారు. రిపబ్లిక్​ డే సందర్భంగా జిల్లా ప్రగతి నివేదికను ఆమె చదివి వినిపించారు. 

కుడా ఆధ్వర్యంలో రూ.85 కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించామని, రూ.30 కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటికే క్రీడా పాఠశాల ఏర్పాటు చేశామన్నారు. దామెర మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు.

అన్నిరంగాల్లో ‘వరంగల్’​ అభివృద్ధి

హనుమకొండ, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో వరంగల్ జిల్లాలను అన్నిరంగాల్లో నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా ప్రగతి నివేదికను ఆమె చదివి వినిపించారు.  రాష్ట్ర ప్రభుత్వం మామునూరు విమానాశ్రయం భూసేకరణ కోసం రూ.295 కోట్లు మంజూరు చేసిందని, గ్రేటర్ వరంగల్ లో 2075 జనాభాను దృష్టిలో పెట్టుకుని రూ.4,170 కోట్లతో అండర్ గ్రౌండ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటోందని వివరించారు. 

కాగా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా గ్రీన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వినూత్న ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ సత్య శారదను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శాలువాతో సన్మానించారు. 

జనగామలో గణనీయ అభివృద్ధి

జనగామ, వెలుగు: జనగామ అభివృద్ధిపథంలో ముందుకు సాగుతోందని కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ తెలిపారు. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా జిల్లా ప్రగతిని చదవి వినిపించారు. మహాలక్ష్మి స్కీమ్​ అమలు కారణంగా 2.89 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించారని తెలిపారు. గృహజ్యోతిలో 4. 92 లక్షల జీరో బిల్లులు జారీ చేయడం వల్ల 94, 298 కుటుంబాలకు లబ్ధి చేకూరుందన్నారు. 

మంజూరైన 5,834 ఇండ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని చెప్పారు. బుకింగ్ యాప్​ ద్వారా ఇప్పటి వరకు జిల్లా లోని 57, 449 మంది రైతులు 2 లక్షల యురియా బస్తాలను కొనుగోలు చేశారని చెప్పారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం కింద ఎంపికైన జనగామ జిల్లాలో 36 కేంద్ర పథకాల్లో అనుసంధానం జరిగిందన్నారు.

 6,710 ఎకరాల్లో 2310 మంది రైతులు ఆయిల్ పామ్​ సాగు చేస్తున్నారని, వారికి రూ.3.48 కోట్ల రాయితీ కింద అందించామని చెప్పారు. గత పదోతరగతి ఫలితాల్లో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని, ఈసారి మరింత మెరుగు ఫలితాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చేనేత రుణ మాఫీ స్కీమ్​ కింద 293 మంది కార్మికులకు రూ.2.06 కోట్ల చెక్కులను  అందించారు.