భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు నదిలో మునిగి తండ్రీకొడుకులు చనిపోయారు. మండలంలోని మొగళ్లపల్లికొత్తూరు గ్రామానికి చెందిన రావుల సూరిబాబు(38), రావుల దేవాన్ష్(9) చేపల వేటకు దండుపేట గ్రామానికి సమీపంలోని తాలిపేరు నదికి వెళ్లారు. చేపలు పడుతూ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.
ఈత వచ్చినప్పటికీ సూరిబాబు తన కొడుకును ఒడ్డుపైకి చేర్చే క్రమంలో నీళ్లలో కొట్టుకుపోయాడు. దేవాన్ష్ అప్పటికే నీళ్లు తాగడంతో చనిపోయాడు. ఘటనా స్థలానికి చర్ల ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ చేరుకొని డెడ్‌బాడీలను ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
