దళిత యువకుడిని ప్రేమించిందని కూతురుని చంపిన తండ్రి

దళిత యువకుడిని ప్రేమించిందని కూతురుని చంపిన తండ్రి

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు కులం తక్కువవాడిని ప్రేమించిందని.. కూతురినే చంపాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో స్థానిక రామనగరలోని కుదూర్‌కు చెందిన 48 ఏళ్ల రైతు కృష్ణప్పను కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణప్పకు 18 సంవత్సరాల హేమలత అనే కూతరు ఉంది. ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వోకలి అనే అగ్రకుల వర్గానికి చెందిన హేమలత.. దళిత వర్గానికి చెందిన పునీత్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. వీరి ప్రేమ గురించి తెలిసిన కృష్ణప్ప.. హేమలతను హెచ్చరించాడు. అయినా కూడా మాట వినకపోవడంతో.. కూతురుని చంపాలని నిర్ణయించుకున్నాడు.

అక్టోబర్ 9న కృష్ణప్ప తన కూతురును పొలం వద్దకు పిలుచుకురావాలని యోగి, మరో మైనర్ బాలుడిని పంపించాడు. వాళ్లు వెళ్లి హేమలతను పొలం వద్దకు మీ నాన్న రమ్మంటున్నాడంటూ పిలుచుకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత యోగి, మైనర్ బాలుడి సాయంతో కృష్ణప్ప.. హేమలతను చంపి మామిడి తోటలో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లుగా ఇంటికి వెళ్లాడు. సాయంత్రం కుదూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులకు.. పునీత్ అనే యువకుడి మీద అనుమానం ఉన్నట్లుగా కృష్ణప్ప తెలిపాడు. దాంతో పోలీసులు పునీత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తనకు ఏం తెలియదని.. తాను, హేమలతో ప్రేమలో ఉన్నామని చెప్పాడు. అంతేకాకుండా.. తమ ప్రేమ విషయం హేమలత తండ్రికి తెలిసిందని.. ఆమెను ఆమె తండ్రి హెచ్చరించాడని కూడా తెలిపాడు. దాంతో పోలీసులు.. కృష్ణప్పను అదుపులోకి తీసుకొని విచారించగా.. దళిత యువకుడిని ప్రేమించినందుకు తానే తన కూతురిని హత్య చేశానని ఒప్పకున్నాడు. అందుకోసం యోగి, మరో మైనర్ బాలుడి సాయం తీసుకున్నట్లు తెలిపాడు. కృష్ణప్ప తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాగాడిలోని మామిడి తోటలో హేమలత మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి.. కృష్ణప్ప, యోగిలను రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు మైనర్ కావడంతో.. అతనిని జువైనల్ హోంకు తరలించినట్లు మాగాడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ తెలిపారు.

For More News..

వరదలు ఎప్పుడొచ్చినా బాధితులు స్లమ్స్​ పేదలే

వరద నీటి విషయంలో కొట్టుకున్న కాలనీ వాసులు