తండ్రి కార్పెంటర్... కొడుకు టాపర్‌ 

తండ్రి కార్పెంటర్... కొడుకు టాపర్‌ 

జార్ఖండ్  టెన్త్ బోర్డు ఫలితాల్లో ఓ కార్పెంటర్ కొడుకు సత్తా చాటాడు. రామకృష్ణ మిషన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన అభిజీత్ ఏకంగా స్టేట్ టాపర్ గా నిలిచాడు. నిన్న జేఏసీ విడుదల చేసిన ఫలితాల  ప్రకారం మొత్తం ఆరుగురు ప్రథమ స్థానంలో నిలిచారు. అందులో అభిజీత్ శర్మ, తను కుమారి, తాన్యా సా, రియా కుమారి, నిషా వర్మ , నిషు కుమారి ఉన్నారు.  జంషెడ్‌పూర్‌కు చెందిన అభిజీత్ టాపర్ గా నిలవడం తన కల అని చెప్పుకొచ్చాడు.   దీనికోసం ఎంతో కష్టపడ్డాడనని, ఐఏఎస్‌ అధికారి కావాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు. అభిజీత్  విజయం పట్ల అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. 

అభిజీత్ ఇంటి ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతని తండ్రి అఖిలేష్ శర్మ వడ్రంగి,  తల్లి తిలోకా శర్మ గృహిణి.  అఖిలేష్ శర్మ నగరంలోని వీధివీధిలో తిరుగుతూ ఫర్నీచర్ వర్క్  చేస్తాడు. అలా సంపాదించిన డబ్బులతోనే కొడుకు చదువు, ఇళ్లు గడుస్తుంది. ఒక్కోసారి పస్తులుండాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు కుమారుడి చదువు ఖర్చులు, స్కూలు ఫీజులు కలిపి 50 వేల వరకు అప్పులున్నాయి. 50 వేలు పెద్ద మొత్తం కాకపోయినా అఖిలేష్ శర్మకు మాత్రం అవి కొండంత భారమే. అయితే  ఈ రోజు తన కొడుకును చూసి గర్వపడుతున్నానని అభిజీత్ తండ్రి తెలిపాడు. తమకి సొంత ఇల్లు, భూమి లేదని, వచ్చే ఆదాయంతో కొడుకును చదివిస్తున్నట్టుగా ఆయన తెలిపాడు.