కూతురి పెండ్లి రోజే గుండెపోటుతో తండ్రి మృతి

కూతురి పెండ్లి రోజే గుండెపోటుతో తండ్రి మృతి

​​​గోదావరిఖని, వెలుగు :  పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కూతురి పెండ్లి రోజే ఓ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. విఠల్‌‌నగర్‌‌కు చెందిన ఎలిగేటి శంకర్‌‌(54) నాలుగు నెలలుగా కిడ్నీ సంబంధ వ్యాధితో డయాలసిస్​ చేయించుకుంటున్నాడు. కూతురు ప్రత్యూష పెండ్లి స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌‌లో బుధవారం ఉదయం10.30 గంటలకు జరిగింది. పెండ్లి జరుగుతున్నప్పుడే శంకర్‌‌ అస్వస్థతకు గురవడంతో ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లి ట్రీట్‌‌మెంట్‌‌ చేయించారు. ఈ లోగా ఫంక్షన్‌‌హాల్‌‌లో పెళ్లి తంతు పూర్తయ్యింది. మధ్యాహ్నం శంకర్‌‌ చనిపోగా ఆ విషయం బయటకు తెలియకుండా పెండ్లి కూతురిని అత్తగారింటికి సాగనంపారు. ఎలిగేటి శంకర్‌‌ పలు పత్రికలు, సిటికేబుల్‌‌లో జర్నలిస్ట్‌‌గా, పద్మశాలి సంఘం నాయకుడిగా పనిచేశారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

పెండ్లి సామాన్లు కొనడానికి వెళ్లి గుండెపోటుతో తండ్రి మృతి

లింగంపేట,వెలుగు  : కామారెడ్డి  జిల్లా  గాంధారిలో కూతురి పెండ్లికి కావాల్సిన సామాన్లు కొనడానికి వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. లింగంపేట మండలం బానాపూర్ తండా పరిధిలోని నారాయణగూడెం తండాకు చెందిన భూక్యా లచ్చిరాం(40), బుజ్జీ దంపతులు రెండెకరాల్లో సాగు చేసుకుని బతుకుతున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు సంతానం. రెండేండ్ల క్రితం భార్యాపిల్లలతో కలిసి పొలం పనులు చేసుకుంటుండగా అడవిపంది వెంట పడింది. పదేండ్లలోపు వయస్సున్న కొడుకులిద్దరూ తప్పించుకునేందుకు ఉరుకుతుండగా ఫారెస్ట్​ సిబ్బంది తవ్విన ట్రెంచ్​లో పడి ప్రాణాలు కోల్పోయారు. 

పెద్ద బిడ్డ పెండ్లి కోసమని...

లచ్చిరాం పెద్ద బిడ్డ కల్యాణికి, అయ్యపల్లి తండాకు చెందిన యువకుడితో పెండ్లి నిశ్చయించారు. జూన్​ మూడో  తేదీన ముహూర్తం పెట్టారు. దీంతో పెండ్లికి కావాల్సిన సామాన్లు ఒక్కొక్కటిగా కొని పెట్టుకుంటున్నాడు. ఈ మధ్యే అల్లుడికి బైక్​ కొన్నాడు. మిగతా సామాన్లు కొనేందుకు భార్యతో కలిసి మంగళవారం సాయంత్రం గాంధారికి వెళ్లాడు. అక్కడే ఓ హోటల్ వద్ద టీ తాగుతుండగా ఛాతిలో నొప్పిగా ఉందంటూ  లచ్చిరాం కుప్పకూలిపోయాడు. ప్రైవేటు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడు. రెండేండ్ల కింద కొడుకులు, ఇప్పుడు తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం కోలుకోలేని స్థితికి చేరుకుంది.