ఆస్తి పంపకంలో తండ్రి అన్యాయం.. కొడుకు ఆత్మహత్యయత్నం

ఆస్తి పంపకంలో తండ్రి అన్యాయం.. కొడుకు ఆత్మహత్యయత్నం

ఆస్తి పంపకంలో తండ్రి అన్యాయం చేశాడని ఐదుగురు కుటుంబసభ్యులు లోపల ఉండి  ఇంటికి నిప్పు పెట్టుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారంలో  చోటుచేసుకుంది. గ్రామస్థులు వెంటనే స్పందించడంతో  పెనుప్రమాదం తప్పింది.  అన్నారం గ్రామానికి చెందిన  ఈరబోయిన సాయిలుకు రాములు, కృష్ణమూర్తి  ఇద్దరు కుమారులు.  వీరికి 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆస్తి తగాదాలు తలెత్తడంతో ఏడాది క్రితం కులపెద్దల సమక్షంలో 9 ఎకరాల భూమిని కుమారులిద్దరికి చెరి సమానంగా పంచడానికి సాయిలు అంగీకరించారు.

రాములు పిల్లలను చదివించడానికి, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉండటంతో  తనకు వచ్చిన భాగంలో ఎకరం అమ్మకానికి పెట్టాడు.  బేరం కుదుర్చుకుని తండ్రి పేర ఉన్న భూమిని రిజిస్ట్రేషన్​ చేయాలని కోరాడు. దానికి తండ్రి నిరాకరించి మొత్తం 9 ఎకరాల భూమిని చిన్నకుమారుడు కృష్ణమూర్తి పేరున రాశారు. పొలంలో తనకూ భాగం ఉందని, తండ్రి అన్యాయంగా తమ్ముడి పేరు చేశాడని, దానిని అమలు చేయకూడదని తహసీల్​ కార్యాలయంలో రాములు ఫిర్యాదు చేశాడు.

కుటుంబసభ్యులు సమస్యను పరిష్కరించుకుంటారని భావించిన ఆఫీసర్లు ఆరు నెలల వేచిచూసిన తరువాత అమలు చేశారు. ఉన్న ఆస్తి తమ్ముడి పేరున కావడంతో రాములు ఆదివారం ఉదయం ఐదు గంటలకు భార్య భాగవ్వ, ఇద్దరు కుమార్తెలు రాణి, సుమలత, కుమారుడు సాయి అంతా ఇంట్లో ఉండగానే లోపల డీజిల్​ పోసి నిప్పంటించాడు. పొగతో ఊపిరి ఆడక కేకలు వేయడంతో స్పందించిన గ్రామస్థులు వెంటనే ఇంటి పైకి ఎక్కి పైన రంధ్రం చేసి ఒక్కొక్కరిని పైకి లాగారు.

ప్రమాదంలో ఇంట్లో ఉన్న బైక్, సామగ్రి అన్నీ కాలిపోయాయి. రూ. 4.55 లక్షల ఆస్తి నష్టం జరిగింది. తండ్రి సాయిలు అన్యాయం చేయడం వల్లే రాములు ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు అతడికి అండగా నిలిచారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాన్సువాడ సీఐ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను తెలుసుకున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా ఇద్దరికి సమానంగా భూమిని పంపిణీ చేయాలని సూచించగా సాయిలు అంగీకరించడంతో  సమస్య పరిష్కారమైంది.