
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘటన
మెట్ పల్లి, వెలుగు : అనారోగ్యంతో ఓ వ్యక్తి చనిపోగా, అతడి కొడుకు చేసిన అప్పులు తీర్చలేదని అంత్యక్రియలను అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని చైతన్యనగర్ కు చెందిన పుల్లురి శ్రీకాంత్ కొన్నేండ్ల ముందు ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం చేశాడు. ఐదేండ్ల కింద 20 మందికి రూ.1.70కోట్లు ఇవ్వకుండా కుటుంబంతో సహా పారిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.రెండేండ్ల కింద శ్రీకాంత్తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అప్పుడు అంత్యక్రియలకు వచ్చిన శ్రీకాంత్‌ను పట్టుకొని నిలదీశారు. డబ్బులు ఇచ్చేంతవరకు అంత్యక్రియలను జరగనిచ్చేది లేదని పట్టుబట్టారు.
రెండు నెలల్లో డబ్బులన్నీ ఇస్తానని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు. కానీ, శ్రీకాంత్ మళ్లీ తప్పించుకుని తిరుగుతున్నాడు. శనివారం రాత్రి శ్రీకాంత్ తండ్రి నారాయణ అనారోగ్యంతో చనిపోయారు. దీంతో శ్రీకాంత్ ఆదివారం మెట్ పల్లికి వచ్చాడు. సమాచారం అందుకున్న బాధితులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి నిలదీశారు. డబ్బులు ఇచ్చేంత వరకు అంతక్రియలు కానిచ్చేది లేదని ఆందోళనకు దిగారు. డబ్బులు ఇవ్వనిదే శవాన్ని కదలనివ్వమని బైఠాయించారు. దీంతో శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఉన్న ఆస్తి అమ్మి బాకీ చెల్లిస్తామని చెప్పినా వినలేదు. కాలనీ వాసులు, కుటుంబసభ్యులు వారిని సముదాయించి డబ్బుల విషయంలో హామీ ఇచ్చారు. పెద్దమనుషుల సమక్షంలో శ్రీకాంత్బాండ్ పేపర్ రాసివ్వడంతో అంతక్రియలు కానిచ్చారు.