వేదిక లీడ్ రోల్‌లో హరిత గోగినేని తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. అరవింద్ కృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు టీజర్‌ను రానా రిలీజ్ చేయగా, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో సుదీప్, మలయాళంలో దిలీప్, హిందీలో ఇమ్రాన్ హష్మీ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో వేదిక మాట్లాడుతూ ‘ఈ టీజర్ చూశాక నా స్ట్రెస్ మొత్తం పోయింది.
మనసంతా సంతోషంగా ఉంది. టీమ్ మొత్తం ఆల్ రౌండ్ ఎఫర్ట్ పెట్టారు. హరిత గారు మంచి ప్లానింగ్‌తో అందరికీ నచ్చేలా రూపొందించారు. ఫిలిం మేకింగ్ పట్ల ఆమెలో ప్యాషన్ చూశాను’ అని చెప్పింది. డైరెక్టర్ హరిత మాట్లాడుతూ ‘అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే ఆ పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది ఈ మూవీ కథ. వేదిక పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. ఎన్నో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డ్స్ వచ్చాయి’ అని చెప్పారు.
ఈ సినిమా తనకొక గొప్ప ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిందని అరవింద్ కృష్ణ అన్నాడు. వేదిక పెర్ఫార్మెన్స్, హరిత స్క్రిప్ట్, అనూప్ మ్యూజిక్, ఆండ్రూ విజువల్స్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తాయి అని నిర్మాత ఏఆర్ అభి చెప్పాడు. నటులు ఇనయా సుల్తానా, సాహితీ, అనీష్ కురువిల్లా, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు.