టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది

టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది

బీజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్

హైదరాబాద్: దుబ్బాకలో ఓడిపోతామని టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని.. అందుకే ప్రత్యర్థులపై దాడుల లాంటి తీవ్రమైన చర్యలకు దిగుతోందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం కోసం పది రోజుల నుండి బీహార్ లో ఉన్నానని.. బీహార్ లో ప్రచారం నిర్వహిస్తుంటే దుబ్బాక ఉప ఎన్నికల ఘటనలు తెలిశాయన్నాను. నిన్న రాత్రి బిజెపి కార్యకర్తల పైన, నాయకుల పైన పోలీసులతో దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేశారు.
అధికార దుర్వినియోగానికి టిఆర్ఎస్ తెరతీసిందని.. అందుకే బిజెపి అభ్యర్థి ఇంటి పైన దాడి చేయడమే కాదు చివరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రమైన చర్య అన్నారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదు. నేడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ శాశ్వతం కాదు అనేది పోలీసు యంత్రాంగం గ్రహించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మన్ననలు పొందడానికి ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో గెలవాలి తప్ప ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా… అడ్డగోలుగా గెలువాలని టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తే ప్రజలు సహించరని పేర్కొన్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా అనుకూల విధానాలు అవలంబించాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ అక్రమాలకు, దౌర్జన్యాలకు, దాడులకు బిజెపి కార్యకర్తలు ఆందోళనకు గురి కావద్దని, ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఓటమి భయంతో టిఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలను రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటోందని టిఆర్ఎస్ పార్టీ ని, ముఖ్యమంత్రిని హెచ్చరించారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి కి దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ నేత లక్ష్మణ్ కోరారు.