
- ప్రధాని మోదీకి లెటర్లతో నిరసన తెలియజేసిన ముంబై ప్రజలు
ముంబై: ముంబై– అహ్మదాబాద్ నేషనల్ హైవే(ఎన్ హెచ్48)పై ఏండ్లుగా కొనసాగుతున్న ట్రాఫిక్ జామ్‌లతో బతకలేకపోతున్నామని..తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముంబైలోని వసాయ్ ఏరియా ప్రజలు ప్రధాని మోదీకి వందలాది లెటర్లు రాశారు. ప్రధానంగా హైవే వెంబడి ఉన్న సుసునావధర్, మల్జిపారా, సంసుపారా, బోబత్‌పాతా, పథర్‌పారాతో సహా అనేక గ్రామాల ప్రజలు మెయిల్ ద్వారా తమ లేఖలను పంపారు.
లెటర్లలో పేర్కొన్నదాని ప్రకారం.."ముంబై–అహ్మదాబాద్ హైవేపై గుంతలు ఏర్పడటం, ట్రాఫిక్, రోడ్డు నిర్వహణలో లోపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో అనారోగ్యం పాలవుతున్నం. స్కూల్ పిల్లలు ఆకలితో, దాహంతో ఇబ్బందిపడుతున్నారు. థానె, కాశీమీరా, వసాయ్, నైగావ్ వంటి ప్రాంతాలకు ఆహారం, వైద్య సేవలకు ఈ హైవేనే కీలకమైన మార్గం. అయితే, రోజూ ట్రాఫిక్ జామ్‌లతో మా జీవితం స్తంభించిపోతున్నది. రోడ్డు మరమ్మత్తులు, ట్రాఫిక్ నియంత్రణ కోసం అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. నిరసనలు చేపట్టాం. అధికారుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సర్వీస్ రోడ్లను పూర్తిచేసి, హైవేపై ట్రాఫిక్‌ను తగ్గించే చర్యలు చేపట్టండి. లేకపోతే, మేం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించండి" అని మోదీకి రాసిన లేఖల్లో స్థానికులు తమ ఆవేదనను చెప్పుకొచ్చారు.