
షూటింగ్స్ బంద్తో టాలీవుడ్ పరిశ్రమ స్తంభించిపోయింది. వేతనాలు పెంపు కోసం గత 15 రోజులుగా సినీ కార్మికులు స్ట్రైక్ చేస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతలు, సినిమా కార్మికుల మధ్య చర్చలు ఓ కొలిక్కిరావట్లేదు. ఇవాళ 16వ రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది.
అయితే, నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్లో.. ఓ 2 కండిషన్ల దగ్గర చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ (ఆగస్ట్ 19న) మరోసారి మెగాస్టార్ చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇక ఇవాళ జరిగే ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ చర్చలతో సమ్మె కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్.
సోమవారం (ఆగస్టు 18) ఫిలిం ఫెడరేషన్ సభ్యులు చిరంజీవితో భేటీ అయ్యారు. తమ సమస్యలను చిరంజీవికి చెప్పుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన భేటీలో కార్మిక సంఘాల సమస్యలను విన్నారు చిరంజీవి.ఫెడరేషన్కు ఏ సమస్యలు ఉన్నా తన వద్దకు రావాలని చిరంజీవి చెప్పినట్లు ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. చిరంజీవి లాంటి వ్యక్తి ఏం చెప్పినా చేసేందుకు సిద్ధమని ఇప్పటికే ఫెడరేషన్ ప్రకటించింది. మరి నేడు జరిగే సమావేశంలో సమస్యలన్నిటికీ చిరు ఓ ఫుల్స్టాప్ పెడతాడో లేదో అనే ఆసక్తి నెలకొంది.