
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లా కోర్సుల ఫీజులు భారీగా పెరిగాయి. ప్రైవేటు కాలేజీల్లో టీఏఎఫ్ఆర్సీ పెంచేందుకు నిర్ణయం తీసుకోగా, సర్కారు కాలేజీల్లో వర్సిటీలు పెంచేశాయి. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లోని ఎల్ఎల్ఎం కోర్సు ఫీజు 4 రెట్లు పెరిగింది. సర్కారు కాలేజీల్లో ఎల్ఎల్ఎం కోర్సు ఫీజు గతంలో ఏటా రూ.4,500 ఉండేది. ఈ ఏడాది దానిని భారీగా పెంచారు. ఓయూ పరిధిలోని 2 కాలేజీల్లో రూ.20,100, కేయూలో రూ.18,780కి పెంచారు. ఓయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో రూ.33 వేలకు పెంచగా, కాకతీయ వర్సిటీలో రూ.28,780గా నిర్ణయించారు.
ఎల్ఎల్బీ కోర్సు ఫీజు గతంలో ఏటా రూ.11 వేలు ఉంటే, ఈసారి దాన్ని రూ.16 వేలకు పెంచారు. ప్రైవేటు కాలేజీల్లో ఎల్ఎల్ఎం కోర్సుకు గతంలో రూ.21,600 నుంచి రూ.35 వేల వరకు ఫీజు ఉంది. ఇప్పడు అది రూ.45 వేలకు పెరిగినట్టు తెలుస్తోంది. అయితే, సర్కారు జీవో ఇవ్వకపోవడంతో, కొన్ని కాలేజీలు కోర్టుకు వెళ్లి టీఏఎఫ్ఆర్సీ అనుమతించిన ఫీజుల వసూలుకు పర్మిషన్ తెచ్చుకున్నాయి.