ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల  మోత

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల  మోత
  • తిరుపతిరావు కమిటీ సిఫారసులను బయటపెట్టలే
  • ఎట్ల కట్టాల్నో అని పేరెంట్స్​లో ఆందోళన
  • డొనేషన్లు, యూనిఫామ్, బుక్స్ పేరుతో అందిన కాడికి దోపిడీ
  • గతంలో ఫీజులు నియంత్రిస్తామని సర్కార్ హడావుడి, తర్వాత సైలెంట్​
  • కేబినెట్ సబ్ కమిటీ ప్రపోజల్స్ ఇచ్చినా పట్టించుకోని ప్రభుత్వం
  • ఫీజుల చట్టంపైనా క్లారిటీ ఇవ్వలే

హైదరాబాద్, వెలుగు: జూన్ వచ్చేసింది..10 రోజుల్లో బడులు తెరుచుకోనున్నాయి. స్కూళ్లకు పోయేందుకు పిల్లలు రెడీ అవుతుంటే.. పేరెంట్స్ మాత్రం ఫీజులను తలుచుకుని బుగులుపడుతున్నరు.  ప్రైవేట్​ స్కూళ్లు గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 10 నుంచి 30 శాతం ఫీజులు పెంచేశాయి. ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాలను నియంత్రించాల్సిన రాష్ట్ర సర్కారు.. కమిటీలు, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నది. ఫీజుల కంట్రోల్‌‌‌‌కు చట్టం తెస్తామని చెప్పి.. తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఇదే సమయంలో డొనేషన్లు, ఇతర ఫీజుల పేరుతో ప్రైవేటు స్కూళ్లు అందిన కాడికి దోచుకుంటున్నాయి.

ఫీజులకు తోడు ఎక్స్‌‌‌‌ట్రా బాదుడు

జూన్ 13న బడులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని 10,763 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 32 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో స్కూల్ స్థాయిని బట్టి ఏటా రూ.20 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్స్, నోట్ బుక్స్, షూస్, బస్ ఫీజులు.. ఇవన్నీ అదనం. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలనే డిమాండ్ చాలా ఏండ్ల నుంచి ఉంది. విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ నిరసనలు, ఆందోళనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయినా సర్కారులో మాత్రం చలనం రావట్లేదు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేకున్నా ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. మేనేజ్‌‌మెంట్లు ఏ లెక్కన అంతమొత్తం వసూలు చేస్తున్నాయనే క్లారిటీ అధికారులకూ లేదు. మరోపక్క పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, యూనిఫామ్.. ఇలా అన్ని బడుల్లోనే కొనాల్సి వస్తోంది. బడుల్లో వ్యాపారాలు చేయొద్దనే ఆదేశాలనూ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.

ఆదాయం తగ్గింది.. ఫీజులు పెరిగినయ్

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు కొంత తక్కువగా ఉన్నా.. సిటీల్లో మాత్రం భారీగానే వసూలు చేస్తున్నాయి. కరోనా కారణంగా ఈ రెండేండ్లలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు మాత్రం ఆన్‌‌లైన్ క్లాసుల పేరుతో పూర్తిస్థాయి ఫీజులు వసూలు చేశాయి. ఇప్పుడు మరో 10% నుంచి 30% దాకా ఫీజులు పెంచేశాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లు ఫస్ట్ టర్మ్ ఫీజులూ వసూలు చేశాయి. కొన్ని స్కూళ్లు ఇంటర్నేషనల్, టెక్నో, ఐఐటీ ఒలంపియాడ్ అంటూ చివర్లో పేర్లు తగిలించుకుని ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నాయి. ఇలాంటి పేర్లు వాడొద్దని జీవో 91 చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌‌లో అయితే ఎల్‌‌కేజీ, యూకేజీలకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే మెజార్టీ స్కూళ్లలో 2022–23 ఇయర్​కు అడ్మిషన్లు పూర్తయ్యాయి. అయినా ఫీజుల నియంత్రణపై సర్కారు క్లారిటీ ఇవ్వట్లేదు.

తిరుపతిరావు కమిటీ రిపోర్టు ఇచ్చినా..

పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్ల ఆందోళనలతో 2017లో ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీ పేరెంట్స్, మేనేజ్‌‌మెంట్లతో చర్చలు జరిపి సర్కారుకు నివేదిక అందించింది. ఏటా 10% ఫీజును మేనేజ్‌‌మెంట్లు పెంచుకోవచ్చని, అంతకు మించి పెంచాలంటే సర్కారు అనుమతి తీసుకోవాలని కమిటీ సూచించింది. ఆ కమిటీ ప్రతినిధులు అప్పట్లో మేనేజ్‌‌మెంట్లతో కుమ్మక్కై ఇలాంటి ప్రతిపాదనలు చేశారనే విమర్శలు వచ్చాయి. మరోపక్క ఫీజుల నియంత్రణపై పేరెంట్స్ కోర్టుకు పోతే.. తిరుపతిరావు కమిటీ వేశామంటూ సర్కారు దాటవేసింది. కానీ ఇప్పటికీ ఆ కమిటీ నివేదికను బయట పెట్టలేదు. అటు అమలూ చేయలేదు.

ఫీజుల చట్టంపై సప్పుడు లేదు

ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తామని జనవరిలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 14 మందితో గ్రూప్ ఆఫ్​మినిస్టర్స్ కమిటీని నియమించారు. ఈ కమిటీ మార్చిలో సమావేశమైంది. గతంలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ చేసిన ప్రతిపాదనలపైనే చర్చించి, వాటి నుంచే కొన్ని ప్రపోజల్స్‌‌‌‌ను సర్కారుకు పంపించింది. ఏటా10% పెంచుకోవచ్చనే ప్రతిపాదన చేసింది. ఫీజుల వివరాలను స్కూల్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టాలని, ఫీజులన్నీ డిజిటల్ మోడ్‌‌‌‌లోనే వసూలు చేయాలని సర్కారుకు సూచించింది. ఈ కమిటీ మినిట్స్ బయటికి రావడంతో పేరెంట్స్, స్టూడెంట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో చట్టంపై ఊసే వినిపించడం లేదు. 

బంగారం కుదువపెట్టాలె

మాకు ఇద్దరు పిల్లలు, ఒకరు నాల్గోతరగతి, ఇంకొకరు ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరికీ కలిపి రూ.1.10 లక్షలు ఫీజు. గతేడాది కరోనాతో స్కూల్ ఫీజు మొత్తం కట్టలేదు. ఇప్పుడు అది కూడా కట్టాలని మేనేజ్‌‌‌‌మెంట్ఒత్తిడి తెస్తున్నది. అప్పులు చేసి ఫీజులు కట్టాలని అనుకుంటున్నం. అదీ దొరక్కపోతే బంగారం కుదువపెట్టాలి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను ప్రభుత్వం నియంత్రించి ఆదుకోవాలి. 
‑ శ్రావణి, పేరెంట్, బాగ్​లింగంపల్లి,హైదరాబాద్

అప్పు చేసి కట్టాలె

నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు 4, ఇంకొకరు 8వ తరగతి. ఇద్దర్నీ కరీంనగర్‌‌‌‌లోని ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్న. మిడ్ మానేరులో భూమి, ఇండ్లు కోల్పోయా. గతేడాది ఇద్దరి ఫీజులు రూ.1.10లక్షలు.. అప్పుచేసి కట్టిన. ఈ ఏడాదీ అప్పు చేసుడే. ప్రైవేటు స్కూళ్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటు న్నాయి. అయినా ప్రభుత్వం నియంత్రించట్లే.
- కొండం శ్రీనివాస్​రెడ్డి, పేరెంట్, నిలోజిపల్లి, కరీంనగర్ జిల్లా

ఫీజులను కంట్రోల్ చేయాలె

స్కూళ్లు ఫీజులను విపరీతంగా పెంచేశాయి. మాకు ఇద్దరు పిల్లలు. ఒక్కొక్కరికి యేడాదికి లక్షన్నర ఫీజులు చెల్లిస్తున్నం. దీనివల్ల పిల్లలను చదివించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోంది. ఫీజులను ఒక్కసారిగా రెట్టింపు చేయడంతో కట్టలేని పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలి.
- ఈ.రవీందర్, తార్నాక, పేరెంట్ 

చట్టం ఏమైంది

రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని ప్రకటించి నెలలు గడుస్తోంది. కానీ ఒక్క అడుగు ముందుకు పడలే. విద్యా సంవత్స రం ప్రారంభం కాకముందే పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు డొనేషన్, ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.
- ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి