ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వలే .. ఎగ్జామ్ బహిష్కరించి నిరసన తెలిపిన తోటి స్టూడెంట్లు

ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వలే .. ఎగ్జామ్ బహిష్కరించి నిరసన తెలిపిన తోటి స్టూడెంట్లు
  • 50 మంది నిజాం కాలేజ్ స్టూడెంట్లను అడ్డుకున్న సిబ్బంది

బషీర్​బాగ్, వెలుగు : సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదని 50 మంది స్టూడెంట్లను హైదరాబాద్ బషీర్​బాగ్​లోని నిజాం కాలేజ్ సిబ్బంది పరీక్షకు అనుమతించలేదు. తమకు ఎగ్జామ్ ఫీజు విషయంలో సమాచారం లేదని, వెంటనే డబ్బులు కడ్తామని అధికారులను స్టూడెంట్స్ కోరారు. అయినా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్​కు చెందిన 50 మంది స్టూడెంట్ల​ను పరీక్ష రాసేందుకు వైస్ ప్రిన్సిపల్ అనుమతి ఇవ్వలేదు. దీంతో మిగిలిన స్టూడెంట్లు అందరూ కలిసి ఎగ్జామ్​ను బహిష్కరించి కాలేజీ​లో ఆందోళనకు దిగారు.

గతంలో ఇలాగే జరిగితే.. ఫీజు కట్టించుకుని ఎగ్జామ్​కు అనుమతి ఇచ్చారని స్టూడెంట్స్ తెలిపారు. ఫీజు కట్టని 50 మంది స్టూడెంట్స్​ను ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తేనే తాము పరీక్ష రాస్తామని చెప్పారు. దీంతో కాలేజీ సిబ్బంది అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆందోళన విరమించాలని స్టూడెంట్స్​ను పోలీసులు కోరారు. తమకు న్యాయం జరిగేదాకా ఆందోళన కొనసాగిస్తామని వారు బైఠాయించారు. మూడు గంటల పాటు స్టూడెంట్స్ ఆందోళన చేపట్టినా.. కాలేజ్ సిబ్బంది మాత్రం ఎగ్జామ్ రాసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఫీజు అంశం తమ పరిధిలో లేదని, ఓయూ రిజిస్టార్​తో మాట్లాడి చెప్తామని వైస్ ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ ఆందోళన విరమించారు.