మోడీ నాకు ఖాస్ దోస్త్.. భారత్తో మైత్రి కీలకం

మోడీ నాకు ఖాస్ దోస్త్.. భారత్తో మైత్రి కీలకం

న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ సంబంధాలు మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ అన్నారు. ఈ సమయంలో తన పర్యటన శుభ సందర్భమన్నారు. రెండ్రోజుల భారత పర్యటనలో సందర్భంగా గురువారం గుజరాత్  కు వెళ్లిన బోరిస్.. అక్కడి నుంచి ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి భవన్ వద్ద ఆయనకు ప్రధాని మోడీ ఆహ్వానం పలికారు. అలాగే ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. దీనిపై బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సంతోషకరమైన ఆహ్వానాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. ‘ప్రపంచంలో నేను ఎక్కడా దీనిని పొందలేకపోవచ్చేమో’ అంటూ జాన్సన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానాన్ని చూసి.. ఒక్కసారిగా తాను సచిన్ టెండూల్కర్ నని భావించానన్నారు. అమితాబ్ బచ్చన్ లా పెద్ద పెద్ద కటౌట్లతో తనకు వెల్కమ్ చెప్పడం అద్భుతంగా అనిపించిందన్నారు. 

భారత్, బ్రిటన్ మైత్రి చాలా కీలకం
ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడం.. ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై రెండు దేశాల ప్రధానులు చర్చించుకున్నారు. దీనిపై బోరిస్ జాన్సన్ స్పందిస్తూ.. రక్షణ భాగస్వామ్యంపై మోడీతో చర్చించానన్నారు. ‘రక్షణ రంగంలో భాగస్వామ్యంతోపాటు హెల్త్ సెక్టార్ లో ఇరు దేశాలు అందించుకోవాల్సిన పరస్పర సహకారం గురించి చర్చించాం. మోడీ నాకు ఖాస్ దోస్త్ (కావాల్సిన స్నేహితుడు)’ అని జాన్సన్ అన్నారు. ప్రస్తుత పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచిందన్నారు. భారత్, బ్రిటన్ ల మైత్రి.. సత్సంబంధాలు చాలా కీలకమన్నారు. 

ఉక్రెయిన్ వార్కు చర్చలతోనే పరిష్కారం
డిఫెన్స్ సెక్టార్ తోపాటు వాణిజ్యం, వాతావరణం లాంటి అంశాల పైనా బోరిస్ జాన్సన్ తో చర్చించనానని ప్రధాని మోడీ తెలిపారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న సమయంలో జాన్సన్ భారత్ ను సందర్శించడం చారిత్రాత్మకమన్నారు. COP 26లో చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. భారత్ జాతీయ హైడ్రోజన్ మిషన్ లో చేరాల్సిందిగా యూకేను ఆహ్వానించామన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్ సంబంధాల విషయంలో కలుపుకునిపోయేలా ఉండాలని కోరామన్నారు. ఉక్రెయిన్ వార్ పైనా ఇరు నేతలు చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో వెంటనే కాల్పుల విరమణ జరగాలని.. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. అఫ్గానిస్థాన్ లో శాంతియుత, సుస్థిత, సురక్షితమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అలాంటి సర్కారుకు తాము మద్దతు తెలుపుతామన్నారు. ఇతర దేశాల్లో ఉగ్రవాదం ప్రబలేందుకు అఫ్గాన్  భూమిని వాడుకోవద్దన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు

రెండ్రోజుల్లో మోడీ విజిట్.. కశ్మీర్లో ఎన్కౌంటర్