పాప పుట్టగా...ఊరు పచ్చగా!

పాప పుట్టగా...ఊరు పచ్చగా!

కాన్పుకోసం హాస్పిటల్​కు వెళ్లింది సావిత్రి. అక్కడ పండంటి బిడ్డను ప్రసవించింది. అప్పటిదాకా పంటి బిగువున అణచిపెట్టిన నొప్పిని... బిడ్డ ఏడుపు వినగానే మర్చిపోయింది సావిత్రి. ‘అమ్మాయి పుట్టిందమ్మా’ చెప్పింది డాక్టర్​.  ‘అదృష్టం అనుకుంది సావిత్రి. దేవతే పుట్టిందని మురిసిపోయాడు భర్త. 
కానీ, అత్తమామల సంగతి వేరు.ఆడపిల్ల అని తెలియగానే మొహం చిట్లించింది అత్త. ‘ఆస్పత్రికి రాలేను’ అన్నాడు మామయ్య. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ నిట్టూర్చారు ఇంట్లోవాళ్లు.  వీళ్లందరి ముభావం భార్యాభర్తలకు  అర్థమైంది. ‘ఏం చేద్దాం?’ అడిగింది భార్య. కొద్దిసేపు ఆలోచించి.. ‘ఇంటికి వెళ్లాక, పండుగ చేద్దాం’ అని నవ్వుతూ బదులిచ్చాడు భర్త. 

ఆడపిల్ల పుట్టిందని తెలియగానే చాలామంది భారంగా ఫీలవుతారు. పుట్టగానే వదిలించుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ, రాజస్తాన్​లోని పిప్లాంత్రిలో మాత్రం అమ్మాయి పుడితే సంబురాలే చేస్తారు. చీరెలు, సారెలు, మిఠాయిలతో పండగ జరుపుతారు. ఆ ఊరి గురించే ఈ కథ... అమ్మాయి పుట్టిన ప్రతిసారీ ఆమె పేరు మీద నూట పదకొండు చెట్లు నాటడం పిప్లాంత్రి అనే ఊళ్లో ఆనవాయితీ. అక్కడి వాళ్లంతా ఆడపిల్ల పుట్టడం అదృష్టం అంటారు. పుడమిని రక్షించేది వాళ్లే అని భావిస్తారు. అందుకే ఆడపిల్ల పుట్టుకను గౌరవంగా స్వాగతిస్తారు. 
పండుగ ఇలా..
ఆ ఊరి జనాభా 5,500 మంది. గ్రామంలో సుమారు ఏటా 60 మంది అమ్మాయిలు పుడతారు.  ఆడపిల్ల పుట్టినప్పుడు చెట్లు నాటుతారు. అంతేనా...  ప్రతి సంవత్సరం ఆగస్టులో అంతకు ముందు సంవత్సరం పుట్టిన పిల్లలందరి కోసం చెట్లు నాటి, పండుగ చేస్తారు.  అమ్మాయిలు పెరిగి పెద్దయ్యాక వాళ్ల పేర్ల మీద నాటిన చెట్లకు వాటిని తోబుట్టువుల్లా భావించి రాఖీలు కడతారు. మరో వైపు పర్యావరణాన్ని రక్షిస్తామంటూ గ్రామాధికారులు ఒక రావి చెట్టు దగ్గర ప్రమాణం చేస్తారు. ఇప్పుడు ఊళ్లో అనేక రకాల చెట్లు ఉన్నాయి. ప్రధానంగా ఉసిరి, మామిడి, గంధం, రావి, వెదురు లాంటి రకరకాల చెట్లు విస్తారంగా ఉన్నాయి. సుమారు మూడు లక్షల యాభై వేల చెట్లు ఈ ఊళ్లో ఉన్నాయి.   చెట్లు పెరగడంతో భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ఆడపిల్ల పుట్టగానే పండుగ చేయాలన్న ఆలోచన కారణంగా మహిళల పరిస్థితులు మారాయి. ఊరి కట్టుబాట్లలోనూ అనేక మార్పులు వచ్చాయి. మరోవైపు ఇది పర్యావరణ ఉద్యమంగా  మారింది. ఆ ఊళ్లో ఈ ఆనవాయితీ అద్భుతాలు జరిగినట్టు ఒక్కసారిగా మొదలవలేదు.  పదిహేనేండ్ల కిందట ఆ ఊరు ఒక కరువు ప్రాంతం. బిడ్డ ఆయువును మధ్యలోనే తీసిన కరువును తరమడానికి, మరే బిడ్డ జీవితం ఇలా ముగిసిపోకూడదని ఓ తండ్రికి వచ్చిన ఆలోచన ఇది. 
మచ్చుకైనా పచ్చదనం లేదక్కడ
పదిహేనేళ్ల కిందట పిప్లాంత్రిలో గనుల కోసం భూమిని తవ్వేవారు. ఎక్కడా ఒక్క చెట్టు కూడా కనిపించేది కాదు. చుక్క నీరూ ఉండేది కాదు. భూములన్నీ బీడువారి పోయాయి. చెట్లు, పచ్చదనం మచ్చుకైనా కనిపించేవి కాదు. ఆ ప్రాంత ప్రజలు రకరకాల జబ్బులతో బాధపడేవారు. దీనికి తోడు తిండి కూడా కరువే. ఎంతోమంది రోగాలతో  చనిపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆడపిల్ల పుడితే బతుకు భారమే’ అనుకునేవారు. దాంతో ఎంతోమంది జీవితాలు మధ్యలోనే ముగిసిపోయేవి. అలాంటి పరిస్థితే.. శ్యాంసుందర్ పాలీవాల్​కు కూడా ఎదురైంది. 2005లో సర్పంచ్​గా ఎన్నికయ్యాడు ఆయన. శ్యాంసుందర్​కు పదిహేడేళ్ల కూతురు ఉండేది. పేరు కిరణ్. ఆమె 2007లో డీహైడ్రేషన్ తో మరణించింది. దీనికి కారణం అక్కడున్న కరువు పరిస్థితులే. గుండెలు పగిలే బాధ ఆ తండ్రిది. కూతురి జ్ఞాపకంగా ఆ గ్రామంలో మొదటిసారి శ్యాంసుందర్​  ఒక మొక్క నాటాడు. పిప్లాంత్రి సర్పంచ్​గా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలి అనుకున్నాడు. తన కూతురి పేరు మీదే కాదు, ఊళ్లోని ప్రతి అమ్మాయి పేరు మీద ఒక మొక్క నాటాలని అందరినీ వేడుకున్నాడు. శ్యాంసుందర్​కు వచ్చిన ఈ  ఆలోచన కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద ఉద్యమంగా మారిపోయింది. 
భవిష్యత్తుకు భరోసా
చెట్లు నాటడంతో పాటు ఆడపిల్లల తల్లిదండ్రులంతా వాళ్ల భవిష్యత్తు మార్చడానికి కట్టుబడి ఉంటారు. బాల్య వివాహాలు చేయం అని అఫిడవిట్​పై సంతకం చేస్తారు. చదువులు పూర్తయ్యాక పెళ్లి చేస్తామని చెప్తారు. ప్రతి అమ్మాయికి ముప్పై వేల రూపాయలతో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి ఆమె చేతికి అందే ఏర్పాటు చేస్తారు. ఆ డబ్బును ఆమె చదువుకు లేదా పెళ్ళికి ఉపయోగిస్తారు. 
అందరూ కలిసి...
మొక్కలు నాటే కార్యక్రమం కోసం ఊళ్లోవాళ్లంతా కలిసి పనిచేస్తారు. ముందు నేలను సిద్ధం చేస్తారు. ఈ గ్రామంలో నిరంతరం చెట్లు నాటుతూనే ఉంటారు.  ఈ ఊళ్లో మహిళల కో– ఆపరేటివ్  సంస్థ కూడా ఏర్పాటుచేసుకున్నారు. దానిద్వారా జ్యూసులు, జామ్​లు తయారు చేస్తారు. వాటిని మార్కెట్​లో  అమ్ముతారు.       
కష్టానికి ఫలితం
గనుల కోసం భూమిని, కొండలను తవ్వినన్నాళ్లు చుట్టూరా వినాశనమే కనిపించింది. ఎప్పుడైతే ఆడపిల్లలను గౌరవించడం, చెట్లను నాటడం మొదలుపెట్టారో అప్పట్నించీ ఆ గ్రామంలో మార్పులు కనిపించాయి.   అందుకు గుర్తుగా చెట్లు నాటక ముందు పరిస్థితి,  నాటిన తరువాత ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే పోస్టర్లు గ్రామం అంతా కనిపిస్తాయి. ప్రకృతిని అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టిన తరువాత ఆ గ్రామ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ గ్రామం పచ్చదానికి కేరాఫ్​ అడ్రస్​గా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు.
ఆడపిల్లలే పుట్టాలి
నాకు ఇద్దరూ కొడుకులే. కానీ,  మా ఊళ్లో అమ్మాయిలకు మర్యాద ఇవ్వడం మొదలైన రోజు నుంచి, నాకు మనవరాళ్లు పుట్టాలని కోరుకున్నాను. గతంలో మా అన్న కూతుళ్లను  భారంగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మేమలా ఆలోచించటం లేదు.  వాళ్ల పేరు మీద కూడా చెట్లు నాటాం. 
ఇప్పుడు  మాకు కొడుకులు కావాలనే కోరిక లేదు. ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడానికి మేము చాలా కష్టపడ్డాం. దానివల్ల మాకు పని దొరికింది. అమ్మాయిలను గౌరవించడం మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటానికి, డబ్బు సంపాదనకు చెట్లు నాటే కార్యక్రమం మాకు బాగా ఉపయోగపడుతోంది. - నానుభాయ్, గ్రామస్తురాలు