
- డిమాండ్ 23-25 శాతం అప్
న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వంటి ఈ–కామర్స్ కంపెనీల వ్యాపారం భారీగా పెరుగుతోంది. ఎఫ్ఎంసీసీ, ఎలక్ట్రానిక్స్, దుస్తుల వంటి వాటిపై జీఎస్టీ తగ్గింపుల వల్ల ధరలు దిగిరావడంతో మెట్రో, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పండుగ డిమాండ్ 23–-25 శాతం పెరిగింది. నవరాత్రి మొదటి రోజు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల పెద్ద స్క్రీన్ టీవీలు, మిడ్-రేంజ్ ఫ్యాషన్, ఫర్నిచర్ వంటి ఎక్కువ డిమాండ్ ఉన్న కేటగిరీల వస్తువుల రేట్లు తగ్గాయి.
మెట్రోతోపాటు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. మార్కెట్ పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ ప్రకారం... పెద్ద టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల రిటైల్ ధరలు 6–-8 శాతం తగ్గాయి. ప్రీమియం మోడల్స్‌కు డిమాండ్ పెరిగింది. రూ. 2,500 కంటే తక్కువ ధర ఉన్న ఫ్యాషన్ వస్తువులపై 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంది. ఫర్నిచర్‌పై కూడా 5 శాతమే జీఎస్టీ ఉంది. ఈసారి పండుగ సీజన్ మొదటి 2 రోజుల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 23–-25 శాతం పెరిగాయి. డిమాండ్గత ఏడాది కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్, టీవీ కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి.
అమెజాన్ దూకుడు
అమెజాన్ తమ పండుగ అమ్మకాల్లో మొదటి రెండు రోజుల్లో 38 కోట్లకు పైగా కస్టమర్ విజిట్స్ వచ్చినట్టు ప్రకటించింది. అత్యధిక ట్రాఫిక్ టాప్–9 చిన్న నగరాల నుంచి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లు, అప్లయన్సెస్, ఫ్యాషన్, వెల్నెస్ ఉత్పత్తులు వంటి కేటగిరీలలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. క్యూఎల్ఈడీ మినీ- ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు వంటి ప్రీమియం వస్తువులకు బలమైన డిమాండ్ ఉంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఎస్ఎంఈల అమ్మకాలు ఊపందుకున్నాయి. 16 వేలకుపైగా ఎస్ఎంఈలు సగటు రోజుతో పోలిస్తే తమ అమ్మకాలను మూడు రెట్లు పెంచుకున్నాయని అమెజాన్ తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్‌కు పండుగ అమ్మకాల మొదటి 48 గంటల్లో యూజర్ విజిట్లు గత ఏడాదితో పోలిస్తే 21 శాతం పెరిగాయి. మొబైల్స్, టీవీలు రిఫ్రిజిరేటర్లు వంటి కేటగిరీలలో డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఇండోర్, సూరత్, వారణాసి వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. స్నాప్‌డీల్ కూడా ఫ్యాషన్ విభాగంలో బలమైన వృద్ధిని సాధించినట్టు తెలిపింది. ఫెస్టివల్ గిఫ్టింగ్ విభాగాలలో 350 శాతం పెరుగుదల నమోదైంది. స్నాప్‌డీల్ సీఈఓ అచింత్ సేతియా మాట్లాడుతూ కొత్త జీఎస్టీ రేట్ల వల్ల దుస్తులు, చెప్పులు వంటి కేటగిరీలలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.