
- రూ.10 వేల కోట్లు సేకరించే అవకాశం
- మార్కెట్ పెరుగుతుండడంతో ఇన్వెస్టర్ల ముందుకొస్తున్న కంపెనీలు
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు వచ్చిన ఐపీఓలు 55
న్యూఢిల్లీ: జీఎస్‌టీ 2.0 సంస్కరణలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అనుకూల విధానాలతో మార్కెట్ పెరుగుతున్న టైమ్‌లో ఇన్వెస్టర్ల ముందుకు వచ్చేందుకు ఐపీఓలు రెడీ అవుతున్నాయి. రానున్న రెండు నుంచి మూడు వారాల్లో 12కి పైగా కంపెనీలు తమ మెయిన్ బోర్డ్ ఐపీఓలను ప్రారంభించనున్నాయి. దాదాపు రూ.10 వేల కోట్లను సేకరించనున్నాయి.
ఐపీఓకు వచ్చేవి..
ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ, జిన్‌కుశల్ ఇండస్ట్రీస్, అట్లాంటా ఎలక్ట్రికల్స్, పార్క్ మెడి వరల్డ్, సోలార్‌వర్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీఓలు రానున్న రెండు వారాల్లో ఓపెన్ కానున్నాయి. వీటితో పాటు జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్, జీకే ఎనర్జీ, గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఆనంద్ రాథీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్, శేషాసాయి టెక్నాలజీస్ ఐపీఓలు కూడా ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి.
ఈ కంపెనీలు సెప్టెంబర్ 15 నుంచి తమ ప్రైస్ రేంజ్‌ను ప్రకటించి, సెప్టెంబర్ 30కి ముందు ఐపీఓలు ప్రారంభించనున్నాయి. ఈ వారంలో యూరో ప్రతిక్ సేల్స్, వీఎంఎస్ టీఎంటీ ఐపీఓలు ఓపెన్ అవుతాయి. వీటి తర్వాత అనంతం హైవే ఇన్‌విట్ (ఆల్ఫా ఆల్టర్నేటివ్స్), ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్, ప్రణవ్ కన్‌స్ట్రక్షన్, ట్రూఆల్ట్ బయోఎనర్జీ కంపెనీలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. ఈ కంపెనీలు తమ ఐపీఓ ధరలను సెప్టెంబర్ 22–30 మధ్య ప్రకటించి, సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్ ప్రారంభంలో పబ్లిక్ ఇష్యూని ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ కంపెనీలన్నీ ఇప్పటికే సెబీ అనుమతులు పొందాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన ఫండ్స్‌ను మూలధన ఖర్చులకు, వ్యాపార విస్తరణకు, అప్పుల చెల్లింపునకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వాడతామని తమ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) లో పేర్కొన్నాయి.
ఈ ఏడాది రూ.75 వేల కోట్ల సేకరణ..
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 55 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.75 వేల కోట్లకు పైగా సమీకరించాయి. కిందటేడాది 91 కంపెనీలు రూ.1.6 లక్షల కోట్లను సేకరించిన విషయం తెలిసిందే. రిటైల్ పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరగడం, బలమైన ఆర్థిక వృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులు వలన కిందటేడాది ఐపీఓ మార్కెట్ సందడి చేసింది. రానున్న నెలల్లో మరిన్ని ఐపీఓలు ఓపెన్ కానున్నాయి.
అక్టోబర్ మధ్యలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, చివరిలో టాటా క్యాపిటల్ ఐపీఓలు కూడా వచ్చే అవకాశం ఉంది. “ఫైనాన్స్, రిటైల్, రెన్యూబుల్స్, మానుఫాక్చరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఐపీఓలు వస్తున్నాయి. మార్కెట్ దీపావళి ర్యాలీకి అనుగుణంగా కంపెనీలు లిస్టింగ్ చేయడం ద్వారా రిటైల్ ఫ్లోలు పెరగొచ్చు” అని ఏంజెల్ వన్ ఎనలిస్ట్ వాఖర్‌జావేద్ ఖాన్ అన్నారు. ఐకానిక్ వెల్త్ ఎనలిస్ట్ శోభిత్ మాతుర్ మాట్లాడుతూ, “యూఎస్ టారిఫ్‌లు, గ్లోబల్ స్లోడౌన్ భయాలను ఇండియన్ మార్కెట్ అధిగమించింది. ఐపీఓలకు ఆసక్తి పెరుగుతోంది” అని పేర్కొన్నారు.
ఈ నెలలో వచ్చే ప్రధాన ఐపీఓలు..
జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ ఐపీఓ ద్వారా రూ.2 వేల కోట్లు సేకరించాలని చూస్తోంది. పార్క్ మెడి వరల్డ్ రూ.1,260 కోట్లను, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ రూ.1,150 కోట్లను సేకరించనుంది. ట్రూఆల్ట్ బయోఎనర్జీ రూ.వెయ్యి కోట్లు, ఆనంద్ రాథీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ రూ.750 కోట్లను సేకరించే ఆలోచనలో ఉన్నాయి. దీపావళికి ముందు ఐపీఓల సందడితో మార్కెట్‌లో పాజిటివ్ మూడ్ క్రియేట్ అవుతోందని ఎనలిస్టులు భావిస్తున్నారు.