న్యాయ వ్యవస్థలో ఫ్యూడల్ సంస్కృతి ఎక్కువ. ఈ సంస్కృతి భారతదేశమంతటా విస్తరించి ఉంది. ఈ సంస్కృతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మాట అనడానికి కారణం ఈ మధ్య సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన తీర్పులు. అవి.. నిర్భయసింగ్ సూలీయా వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎఫ్ఎల్సి (సి) నెం. 24570– 2024. ఇది సుప్రీంకోర్టు తీర్పు. రెండోది మధ్యప్రదేశ్ హైకోర్టు జగత్ మోహన్ చతుర్వేది వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2025 ఎస్సీసీ. ఆన్లైన్ మధ్యప్రదేశ్ 2314. తీర్పు తేదీ 14–7–2025. ఈ హైకోర్టు న్యాయమూర్తులు ఎక్కువ మంది గతంలో హైకోర్టుల్లో న్యాయవాదులుగా పనిచేసినవాళ్లే. వీరందరూ తమ పదోన్నతి కోసం న్యాయమూర్తుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ ఎంత తిరిగారో, ఎన్ని అగచాట్లు పడ్డారో నేను చెబితే బాగుండదు. ఎవరికివారు తమ గుండెలమీద చేయి వేసుకుంటే వాళ్లకే అర్థమవుతుంది. ఇలా న్యాయమూర్తులుగా ఎదిగినవాళ్లు దిగువ కోర్టు న్యాయమూర్తులను మనుషులుగా చూస్తే చాలు. కానీ, అలా జరగడం లేదు. నా ఈ మాటలకు మినహాయింపులు ఉన్నాయి.
న్యాయమూర్తులకి ‘ఈగో’ కూడా ఎక్కువ. ఈ మాటలు నేను అనడం లేదు. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ లోని మన రాష్ట్రానికి చెందిన జస్టిస్ సంజయ్‌కుమార్ అన్న మాటలు. ఈ ఫ్యూడల్ సంస్కృతి అంటని న్యాయమూర్తి సంజయ్ కుమార్. అందుకే ఆయన ఈ మాటలను అనగలిగారు. గత మే నెలలో న్యాయమూర్తులు సంజయ్ కుమార్, విక్రమ్‌నాథ్ బెంచి ముందు ఓ న్యాయవాది తన కేసులో తన సీనియర్ హైకోర్టులో ఒక కేసుని వాదిస్తున్నారని అందువల్ల అతను బిజీగా ఉండటం వల్ల సుప్రీంకోర్టుకి ఇంకా చేరుకోలేదని కోర్టుకి విన్నవించారు. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్‌కుమార్ ఆ న్యాయవాదితో ఇలా అన్నారు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఈగోని కించపరచకూడదని అనుకుంటే అటువంటి సమాచారాన్ని అంత సులువుగా వెల్లడించకూడదు’ అని ఆ న్యాయవాదికి సూచించారు. న్యాయమూర్తుల అహంకారాలు చాలా పెలుసుగా ఉంటాయని న్యాయమూర్తి అన్నారు. అక్కడితో ఆయన ఊరుకోలేదు. ‘మీరు అంత నిజాయితీగా ఉండకూడదు. భవిష్యత్తులో ఇలా చేయకండి. హైకోర్టులో మీ సీనియర్ బిజీగా ఉన్నారని సుప్రీంకోర్టులో ఎప్పుడూ చెప్పకూడదు.
మా ఈగోలు చాలా పెలుసుగా ఉంటాయి. అలా చెబితే మీ కేసు బయటపడుతుంది. అర్హతల మీద కాదు. ఇలాంటివి చెప్పకండి. చిన్న చిన్న అబద్ధాలు చెప్పండి. అవి అనుమతించడం జరుగుతుంది. అంటే కేసు మెరిట్మీద కాకుండా మరోవిధంగా పరిష్కరించడం జరుగుతుందని ఆ న్యాయవాదికి జస్టిస్ సంజయ్‌కుమార్ చెప్పారు. ఈ సూచన ఎలా ఉందంటే రావిశాస్త్రి రాసిన ‘మాయ’ కథలో సీనియర్ న్యాయవాది తన జూనియర్‌కు చెప్పినట్టుగా ఉంది. ఈ విషయాలను జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడా అంగీకరిస్తూ ఇలా అన్నారు. ‘మీ సీనియర్ మీకు ఈ విషయాలు నేర్చించి ఉండాలి. నిర్భయ్ సింగ్ సూరీయా తీర్పుని సుప్రీంకోర్టు 5 జనవరి 2026న వెలువరించింది. ఆ తీర్పుని చదివిన తరువాత జస్టిస్ సంజయ్‌కుమార్ మాటలు అదేవిధంగా జగత్ మోహన్ చతుర్వేది కేసులో న్యాయమూర్తి అతుల్ శ్రీధరన్ బెంచ్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి.
నిర్భయ్‌సింగ్ సూలీయా కేసు
నిర్భయ్‌సింగ్ సూరీయా మధ్యప్రదేశ్‌లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసేవాడు. అవినీతి, డబుల్ స్టాండర్డ్స్ గా వ్యవహరిస్తున్న కారణాలు చూపి అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. తప్పుడు ఉత్తర్వులు వెలువరించినందుకు ఉద్యోగం నుంచి తొలగించడం సమంజసమేనా అన్నది ప్రధానమైన విషయంగా సుప్రీంకోర్టు పరిశీలించింది. న్యాయపరమైన బెయిల్ ఉత్తర్వుల్లో తప్పులు దొర్లినంతమాత్రాన ఉద్యోగం నుంచి తొలగించడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తప్పుగా రాయడం దుష్ప్రవర్తన కిందకు రాదని, అతనిపై అవినీతి ఆరోపణలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడి తిరిగి ఉద్యోగంలో నియమించాలని ఆదేశించింది. తప్పుగా ఉత్తర్వులు రాయడానికి, మిస్ కాండక్ట్‌కి చాలా భేదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అవినీతి, పూర్వ భావనలు ఉన్నప్పుడు మాత్రమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాకాకుండా న్యాయపరమైన ఉత్తర్వుల్లో తప్పిదాల కారణంగా చర్యలు తీసుకుంటే న్యాయవ్యవస్థలో స్వతంత్రత విలువ తగ్గిపోతుందని కోర్టు ఈ కేసులో అభిప్రాయపడి అతనికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జేబీ పర్దివాలా, కేవీ విశ్వనాథన్‌లు వెలువరించారు.
జగత్ మోహన్ చతుర్వేది కేసు
జగత్ మోహన్చతుర్వేది 1987వ సంవత్సరంలో సివిల్ జడ్జిగా చేరి పదోన్నతి మీద జిల్లా జడ్జి అయినాడు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రదేశ్ న్యాయమూర్తిగా పనిచేశారు. అతని సర్వీస్ అంతా కూడా మచ్చ లేకుండా కొనసాగింది. అధికారిక విధులు నిర్వహణకి సంబంధించి ఎప్పుడూ ఒక్క నోటీసు కూడా అతను తీసుకోలేదు. 2015వ సంవత్సరంలో బెయిల్ దరఖాస్తులను ఆమోదించడంలో తిరస్కరించడంలో అవకతవకలు ఉన్నాయని అతనికి చార్జ్‌షీట్ జారీ చేశారు. ఆ తరువాత జరిగిన డిపార్ట్మెంటల్ విచారణలో ఒకే ఒక సాక్షిని విచారించారు.
ఎలాంటి డాక్యుమెంట్లు కూడా లేవు. అతనిపై అభియోగాలు రుజువైనాయని పేర్కొంటూ విచారణ అధికారి నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఆ న్యాయమూర్తి దానికి సమాధానం ఇచ్చాడు. అతడిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. దీనిపై సివిల్ సర్వీసెస్ నియమాల ప్రకారం అప్పీలుని దాఖలు చేశాడు. దాన్ని కొట్టి వేశారు. దీంతో హైకోర్టులో రిట్ పిటిషన్ని దాఖలు చేశాడు. న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, దినేష్ కుమార్ పరివాల్ బెంచ్ ముందు ఈ దరఖాస్తు వచ్చింది. న్యాయమూర్తి అతుల్ శ్రీధరన్ తీర్పుని ప్రకటించారు.
విశ్లేషణ
అతనిపై మోపిన మూడో అభియోగంలో మాత్రమే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బెయిల్ దరఖాస్తు తిరస్కరించి నిందితులు ఎవరూ ఆ న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయలేదు. విచారణ సమయంలో తాను ముందస్తు బెయిలును మేజిస్ట్రేట్స్ విచారించే కేసుల్లోనే ఇచ్చానని న్యాయమూర్తి చెప్పుకున్నాడు. బెయిలు మంజూరు చేసిన తరువాత సెషన్స్ కోర్టు విచారించే కేసులని పోలీసులు చేర్చినారని ఆ న్యాయమూర్తి చెప్పాడు.
విచారణలో అధికారి విచారించి ఒకే ఒక సాక్షిని, ఆయన న్యాయమూర్తిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. శాఖాపరమైన విచారణలో ఆ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అప్పిలేట్ కోర్టు మాదిరిగా విచారణాధికారి పరిశీలించాడు. ఆ న్యాయమూర్తి జారీ చేసిన బెయిలు ఉత్తర్వులకు వ్యతిరేకంగా స్టేట్ హైకోర్టులో సవాలు చేయలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు అతడిని తొలగించడాన్ని కొట్టివేసింది.
శాశ్వత భయంతో పనిచేస్తున్న జిల్లా న్యాయవ్యవస్థ
న్యాయవ్యవస్థలో నెలకొని ఉన్న భూస్వామ్య సామాజిక కారణాల వల్ల విచారణ సమర్థవంతంగా జరగలేదని, పరిష్కారం కాలేదని ఈ వ్యాధి అన్ని కేసుల మాదిరిగా ఈ కేసులో కూడా ఉందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. జిల్లా న్యాయవ్యవస్థ హైకోర్టు భయంతో పనిచేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. నిందితులకు అనుకూలంగా బెయిలు మంజూరు చేయడం వల్ల న్యాయమూర్తిని ఉద్యోగం నుంచి తొలగించారన్న సందేశం జిల్లా న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయమూర్తులందరికీ చేరిందని, అందుకని బెయిల్స్ ను మంజూరు చేయడానికి, కేసులను కొట్టివేయడానికి న్యాయమూర్తులు జంకుతున్నారని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
హైకోర్టు న్యాయమూర్తులకి, జిల్లా న్యాయవ్యవస్థ న్యాయమూర్తులకి మధ్య దుర్భరమైన సంబంధం ఏర్పడింది. అది భూస్వామ్య ప్రభువుకి, సేవకుడికి మధ్య ఉన్న సంబంధం మాదిరిగా మారిపోయింది. జిల్లా జడ్జీలు హైకోర్టు న్యాయమూర్తిని పలకరించేటప్పుడు వారి శరీర భాష చాలా దయనీయంగా ఉంటుందని, దీనివల్ల వాళ్లు వెన్నెముక లేని అకశేరుక క్షీరదాల జాతిగా మారిపోతున్నారని కోర్టు అభిప్రాయపడింది.
న్యాయమూర్తులు మూలాలను గుర్తుంచుకోవాలి
రైల్వే ఫ్లాట్ ఫామ్‌ల మీద హైకోర్టు న్యాయమూర్తులను రిసీవ్ చేసుకుంటున్న జిల్లా న్యాయమూర్తులు రిఫ్రెష్మెంట్స్ పట్టుకుని వేచిచూడటం సర్వసాధారణం. అది వలస రాజ్యాల క్షీణతను శాశ్వతం చేస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్‌కుమార్, హైకోర్టు న్యాయమూర్తి అతుల్ శ్రీధరన్ లాంటి వాళ్లు న్యాయవ్యవస్థలో అతి తక్కువగా ఉన్నారు. నేను 2015లో ఆంధ్రప్రదేశ్ జ్యడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ మేజిస్ట్రేట్ ఈ అసౌకర్యం గురించి చెప్పాడు.
కోర్టు సమయాల్లో కూడా వెళ్లాల్సి వస్తోందని చెప్పాడు. అలా వెళ్లవద్దని క్లాసులో చెప్పాను. నేను అలాగే ఉన్నాను. 2023లో మళ్లీ తెలంగాణ జ్యుడీషియల్అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసినప్పడు కూడా చెప్పాను. నాలాంటి ఒకరిద్దరు తప్ప అందరూ అలా ఉండలేకపోతున్నారు. భయాలు, ఆశలు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ మూలాలను గుర్తుచేసుకుంటే తప్ప ఈ భూస్వామ్య ప్రభువు, సేవకుడు భావనలు పోవు.
- డా. మంగారి రాజేందర్,జిల్లా జడ్జి (రిటైర్డ్)
