పనాజీ: ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి మళ్లీ డ్రాతోనే సరిపెట్టుకున్నాడు. మంగళవారం (నవంబర్ 18) వీ యి (చైనా)తో జరిగిన క్వార్టర్‌ఫైనల్ రెండో రౌండ్ గేమ్‌ను అర్జున్ 32 ఎత్తుల వద్ద డ్రాగా ముగించారు. దీంతో ఇద్దరూ పాయింట్‌ను పంచుకున్నారు. విజేతను తేల్చేందుకు టైబ్రేక్‌ను నిర్వహించనున్నారు.
తెల్లపావులతో ఆడిన ఇండియన్ ప్లేయర్‌కు గేమ్ మధ్యలో అడ్వాంటేజ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జావోకిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్).. జోస్ మార్టినెజ్ (మెక్సికో), సామ్ శాక్లాండ్ (అమెరికా).. ఆండ్రీ ఎసిపెంకో (రష్యా) మధ్య జరిగిన గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. అలెగ్జాండర్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో 1.5 తేడాతో గెలిచిన నొడిర్బెక్ యాకుబోవ్ (ఉజ్బెకిస్తాన్) సెమీస్‌లోకి ప్రవేశించాడు.
