హార్దిక్‌‌తో ఎందుకు బౌలింగ్ చేయించరు?

హార్దిక్‌‌తో ఎందుకు బౌలింగ్ చేయించరు?

పూణె: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో భారత్‌‌ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్‌‌లో రాణించి 337 రన్స్ చేసినప్పటికీ భారీ స్కోరును కాపాడుకోవడంలో చతికిలపడింది. అయితే మ్యాచ్‌‌లో ఆల్‌‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ చేయించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఫిట్‌గా ఉన్నప్పటికీ బౌలింగ్‌కు దూరంగా ఉంచడం సరికాదంటూ టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌పై వెటరన్‌లు వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యారు. ‘హార్దిక్ ఎందుకు బౌలింగ్ చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. అతడు టీ20 సిరీస్‌‌లో చక్కగా బౌలింగ్ వేశాడు. మ్యాచ్ ఓడిపోయే పరిస్థితిలో ఆరో బౌలింగ్ ఆప్షన్‌ను వాడుకోవాల్సిందే’ అని లక్ష్మణ్ సూచించాడు.

పాండ్యా మీద పని భారం ఎక్కువవతోందని అంటున్నారని, కానీ అతడికి బ్యాక్ సర్జరీ అయినప్పటి నుంచి బౌలింగే చేయలేదని వీరూ అన్నాడు. ఆరో బౌలర్ అందుబాటులో ఉన్నా అతడి సేవలు వాడుకోకపోవడం భారత్ కొంప ముంచిదన్నాడు. ‘హార్దిక్ పాండ్యాకు పని భారం ఎక్కువైందని ఎవరు నిర్ణయించారో నాకు తెలీదు. బ్యాక్ సర్జరీ తర్వాత అతడు పెద్దగా క్రికెట్ ఆడలేదు. టెస్టుల్లో బరిలోకి దిగలేదు. ఆడిన ఐదు టీ20ల్లో 2-3 మ్యాచుల్లోనే బౌలింగ్ చేశాడు. కాబట్టి అతడిపై లోడ్ పడిందనేది సరికాదు. పూర్తి ఓవర్లు కాకపోయినా మధ్యలో కొన్ని ఓవర్లు అతడితో వేయించాలి. త్వరలో ఐపీఎల్ ఉన్నందున తనను వన్డేల్లో బౌలింగ్‌‌కు దూరంగా ఉంచాలని మేనేజ్‌మెంట్‌‌ను పాండ్యానే అడిగాడేమో’ అని వీరూ చెప్పుకొచ్చాడు.