V6 News

FIFA World Cup: ఒక్కో టిక్కెట్ రూ. 21 కోట్లు! : వరల్డ్ కప్ ఫైనల్ చూడాలంటే కోట్లు కావాలి భయ్యా..

FIFA World Cup: ఒక్కో టిక్కెట్ రూ. 21 కోట్లు! : వరల్డ్ కప్ ఫైనల్ చూడాలంటే కోట్లు కావాలి భయ్యా..

FIFA World Cup: ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తోన్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ఆరంభం కాబోతుంది. జూన్ 11 నుంచి జులై 19వ తేదీ వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. కానీ దీని టికెట్ల కోసం ఇప్పటికే 50 కోట్లకు పైగా అభ్యర్థనలు వచ్చాయని ఫిఫా వెల్లడించింది. తాజాగా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు నాలుగు ప్రత్యేక సీట్ల టికెట్లను ఫిఫా రీసేల్ సైట్ సేల్‌కు పెట్టగా, ఆ టికెట్ల ధర ఒక్కోటి 2.3 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.21 కోట్లు). దీంతో ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క టికెట్‌కు అంత ధర పెట్టడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

జులై 19న న్యూజెర్సీ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఈ ప్రత్యేక సీట్లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. గోల్ వెనక భాగంలో ఉన్న లోయర్ డెక్‌లోని బ్లాక్-124, లైన్-45లో సీట్ నంబర్లు 33 నుంచి 36 వరకు ఉండనున్నాయి. మరిన్ని ఇతర సీట్ల ధరలను కూడా ఫిఫా ప్రకటించింది. మరో ఐల్ సీట్ ధర 2 లక్షల డాలర్లకు పైగా ఉండగా, అప్పర్ డెక్‌లోని సీట్లు కూడా లక్షల డాలర్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అదే సెక్షన్‌లో పక్కనే ఉన్న మరో సీట్ మాత్రం కేవలం 23 వేల డాలర్లకు సేల్ కి పెట్టడం గమనార్హం. ఈ ప్రపంచ కప్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్రీడాభివృద్ధికి తన 211 సభ్య దేశాలలో తిరిగి పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఫిఫా వెల్లడించింది. 

►ALSO READ | 2038 Asian Games: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా భారత్ ప్లాన్.. 2038 ఆసియా గేమ్స్‌కు బిగ్ బిడ్..  

ఇక ఫిఫా ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లు జూన్ 11 నుంచి జులై 19 వరకు 39 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 32 దేశాలే మాత్రమే పాల్గొంటుండగా.. ఈ సారి మాత్రం 48 దేశాలు పోటీకి దిగబోతున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 19న అమెరికాలోని న్యూజెర్సీ ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం భారీగా పోటీ కొనసాగుతుంది. దీంతో టాప్ కేటగిరీ టికెట్ల ధరలని ఫిఫా ఇటీవల భారీగా పెంచేసింది. ఒక్కో టికెట్ ధరను 10,990 డాలర్లు (రూ.10.19 లక్షలు)గా ఫిక్స్ చేసింది.