అమర్‌‌నాథ్‌‌ యాత్రకు.. 7 వేల మందితో ఐదో బ్యాచ్‌‌

అమర్‌‌నాథ్‌‌ యాత్రకు.. 7 వేల మందితో ఐదో బ్యాచ్‌‌

జమ్మూ: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికి దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌‌ నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 7,208 మంది యాత్రికులతో కూడిన ఐదో బ్యాచ్ భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి రెండు వేర్వేరు కాన్వాయ్ లలో యాత్రకు బయల్దేరింది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద యాత్రికుల బృందం. దీనిలో1,587 మంది మహిళలు, 30 మంది పిల్లలు ఉన్నారు. దీంతో ఈ యాత్రకు బయల్దేరిన భక్తుల సంఖ్య 50వేల మార్కును దాటింది. జులై 3న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కాగా 38 రోజుల పాటు ఇది కొనసాగనుంది. 

పహల్గామ్​లో టెర్రర్ అటాక్ చోటు చేసుకోవడంతో యాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ, కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రభుత్వం ఈ యాత్రను నిర్వహిస్తోంది. భగవతి నగర్ బేస్ క్యాంప్​లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. ఈ యాత్ర కోసం ఇప్పటివరకు 3.5 లక్షల మందికి పైగా ప్రజలు ఆన్‌‌ లైన్​లో నమోదు చేసుకున్నారు. జమ్మూ అంతటా 34 వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు.