శివ్వంపేటలో భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. ముగ్గురిపై దాడి

శివ్వంపేటలో భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. ముగ్గురిపై దాడి

శివ్వంపేట, వెలుగు: భూ వివాదంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెదక్‌‌‌‌ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మహమ్మద్‌‌‌‌ మొజం ఖురేషి, అబ్దుల్‌‌‌‌ రహమాన్‌‌‌‌ అన్నదమ్ములు. భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో ఆదివారం రాత్రి అబ్దుల్‌‌‌‌తో పాటు అతడి కొడుకులు హిజాస్, హజీస్, ఇంతియాజ్, హజం కలిసి ఖురేషి కొడుకు ఇర్ఫాన్‌‌‌‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న ఖురేషి, ఇలియాస్‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వీరిపై కూడా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇలియాస్, ఇర్ఫాన్‌‌‌‌కు గాయాలయ్యాయి. గాయపడినవారిని నర్సాపూర్‌‌‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. 

తలకు గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌లో ఎంఆర్‌‌‌‌ఐ తీసుకొని రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి సోమవారం ఉదయం ఆరు గంటలకు తిరిగి నర్సాపూర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు చేరుకున్నారు. అయితే ఎంఆర్‌‌‌‌ఐ రిపోర్ట్‌‌‌‌ వచ్చాకే హాస్పిటల్‌‌‌‌లోకి రావాలని నర్సాపూర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ సిబ్బంది చెప్పడంతో అక్కడే చెట్టు కింద పడుకున్నారు. 

సోమవారం ఉదయం హాస్పిటల్‌‌‌‌కు చేరుకున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి.. గాయపడిన వారిని ఆరుబయటే ఉంచడంతో డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌‌‌‌లోకి తీసుకెళ్లి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసే వరకు అక్కడే ఉన్నారు. దాడికి సంబంధించిన వీడియోలు సీసీ ఫుటేజీలో రికార్డు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.