ఆత్మాభిమానానికి..అహంకారానికి మధ్య పోరాటం

ఆత్మాభిమానానికి..అహంకారానికి మధ్య పోరాటం

హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ ఆత్మాభిమానానికి.. ఒక వ్యక్తి అహంకారానికి మధ్య  పోరాటం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ అన్నారు. కేసీఆర్  నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ గళం విప్పారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో ఉన్నప్పుడే కాదు.. సమాజంలోనూ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజేందర్ గళం విప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చేసే దిశలో భాగంగా ఆయన శుక్రవారం హైదరాబాద్ లో పర్యటించారు. పార్టీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రెటరీ జనరల్ శివప్రకాశ్ తో కలసి వచ్చారు.

తొలుత బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతి తదితరులతో సమావేశమై చర్చించారు. అనంతరం షామీర్ పేటలోని మాజీ మంత్రి ఈటెల నివాసానికి వెళ్లి కలిశారు. తమ భేటీ అధికారికమేనని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ గళం తెలంగాణ సమాజ మనోగతం అని అయితే నియంతృత్వ పోకడతో ఆ గళాలను అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన, ఓ వ్యక్తి అహంకారం, నియంతృత్వం తొలగిపోవాలని, ప్రజల మాట వినాలన్నారు. దీని కోసం తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చినా బీజేపీ తరపున స్వాగతిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, గౌరవం, అవినీతి రహిత పాలన ఉండాలన్నదే బీజేపీ అభిమతం అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు.