తిరుపతి: తిరుమలలో భక్తుల మద్య ఘర్షణ జరిగింది. భక్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. నారాయణగిరి క్యూలైన్లలో భక్తుల మధ్య గొడవ జరిగింది. అక్కడి సిబ్బంది వారిస్తున్నా పరస్పరం పిడిగుద్దులతో భక్తులు దాడులు చేసుకోవడం కలకలం రేపింది. ఈ గొడవకు కారణం తెలియాల్సి ఉంది. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గురువారం రాత్రి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవల క్యూలైన్లలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. వేసవి సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించి భక్తులు నీరసించిపోతున్నారు. ఓపిక నసించి.. ఇలా చిన్న చిన్న విషయాలకే భక్తులు గొడవలు పడుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని నిర్మలమైన మనసుతో తిరిగి ఇళ్లకు చేరుకోవాల్సిన భక్తులు ఇలా వీధి రౌడీల్లా గొడవలు పడుతుండటం, అది కూడా తిరుమలలో ఆలయ క్యూ లైన్ల దగ్గర, ఆలయ ప్రాంగణంలో గొడవలు పడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భక్తులు అసహనానికి, ఆగ్రహానికి లోనై ఆలయ పవిత్రతను దెబ్బతీయొద్దని తిరుమల ఆలయ సిబ్బంది కోరుతున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే పోలీసులకు విషయం చెప్పాలని.. అంతే గానీ ఇలా గొడవలు పడొద్దని ఆలయ సిబ్బంది భక్తులకు సూచించారు.
