కుమ్మమూరి సుబ్బాయమ్మ రాసిన ‘ఎదురీత’ నవలలో ప్రధాన పాత్ర సుశీల. ఆమె జీవితంలో ఎన్నో కలతలు, కష్టాలు, మలుపులు, గెలుపులు. తల్లిదండ్రులకు ఆమె మొదటి సంతానం. తన తర్వాత ఇంకా తొమ్మండుగురు. ఒకరు సంపాదిస్తే పది మంది బతకాల్సిన పరిస్థితి. తొమ్మిదో తరగతి చదువుతుండగానే సుశీలకు పెళ్లి చేశారు. చదువుకు బ్రేక్ పడింది. ఆమె జీవితం ఆమె చేతుల్లో లేకుండా పోయింది. అత్తవారింట్లో - కట్నం తేలేదనే ఒకే ఒక్క కారణంతో నిరంతరం అత్త సాధింపులు, భర్త వేధింపులు. ఒకనాడు మబ్బు లేకుండా వర్షం కురిసినట్లు, ఉరుము లేకుండా మెరుపు మెరిసినట్లు అత్త ఉగ్రరూపమెత్తి కోడలిని పుట్టింటికి తరిమేసింది. కొన్నాళ్లకు “అవునన్నా కాదన్నా అతను నా భర్త. అది నా అత్తవారిల్లు. అంటే నా ఇల్లు. నేనే వెళ్తాను” అని వచ్చిన సుశీల ముఖం మీదే తలుపులు మూసేశారు తల్లీ కొడుకులు. మళ్ళీ రాకుండా చేశారు.
అత్తవారిల్లు విడిచివచ్చి 20 ఏళ్లు గడిచాయి. ఒకనాడు సుశీలను ఆమె మేనత్త, ఊరికి తీసికెళ్లింది. ఇన్నాళ్లూ బయటి ప్రపంచం చూడని తనకు ఈ అవకాశం సంతోషాన్నిచ్చింది. మేనత్త స్నేహితురాళ్ల ద్వారా “అదృష్టము వక్రించిన మహిళలకు ఆంధ్ర మహిళాసభలో ఉచితవిద్య. ఉచిత భోజనం” అనే ప్రకటన గురించి విన్నది. చదువుకోవాలనుకున్నది. తండ్రే వారించాడు. “ఇది నా జీవితం. నా నిర్ణయం నాది. ఎవరి మాటకో తలొగ్గి ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే నా జీవితం శూన్యమే. ఇప్పుడే నేను ఎదురీత నేర్చుకోవాలి. ఎదురీదుతా. దీక్ష పడితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు” - అని నిశ్చయించుకున్నది. మెడలో తాళి, కాలికి మెట్టెలు ఉన్న ఆమె, ఒక కొత్తరకం విద్యార్థినిలా అడుగు పెట్టింది. చదువులోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందున్నది. స్కూల్ విద్య ముగించుకొని బేసిక్ ట్రైనింగ్‌లో చేరింది. ఈ ట్రైనింగ్ ముగిసిన వెంటనే అదే పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగమొచ్చింది. ఆమెకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. తన జీవితం ఎదురీతలో తొలి విజయంగా భావించింది. ఉద్యోగం చేస్తూనే, సాయంకాల కళాశాలలో డిగ్రీ దాకా చదివింది. ఆమె కోరిక ప్రకారం బి. ఇడి. చేసేందుకు స్కూల్ యాజమాన్యం జీతంతో కూడిన సెలవు ఇస్తుంది.
సుశీల జీవితం మరో మలుపు తిరిగింది. సుశీల భర్తకు తల్లి కాలం చేయడంతో, సుశీలను తీసికెళ్లడానికి వచ్చాడు. ఆమెకు ఇష్టం లేదు. కానీ, తన చదువుకు, ఉద్యోగానికి ప్రోత్సహించిన వారే ‘చదువెంత ముఖ్యమో వైవాహిక బంధమూ అంతే ముఖ్యం’ అని నచ్చచెప్పారు. “నేను నా ఉద్యోగం వదులుకొని రాను. సెలవుల్లో నీ దగ్గరకు వచ్చి పోతుంటా” అని భర్తకు చెప్పింది. సుశీలకు లౌకిక జ్ఞానం పెరిగింది. అనుభవం నేర్పిన పాఠాలు ఏటికి ఎదురీదడం నేర్పాయి. భర్త కూడ సహకరిస్తున్నాడు. వారి కాపురం ఫలితంగా ఒక ఆడపిల్లను, మరో మూడేళ్లకు మగపిల్లవాడిని కన్నది. కానీ, అనారోగ్యంతో కూతురు చనిపోయింది. ఆ బాధ మర్చిపోవడానికి సాహిత్యానికి చేరువైంది. భర్త పట్టించుకోకపోయినా, ఇల్లు కట్టింది. మరుదుల చదువులు, పెళ్ళిళ్లు అయ్యేటట్లు చేసింది.
కొడుకు రఘును ఇంజనీరింగ్ వరకూ చదివించింది. తాను ఉద్యోగ పదవీ విరమణ పొందింది. అమెరికా వెళ్లి ఉన్నత చదువు చదువుతానని రఘు అంటే..., ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి, లోన్ తీసుకొని అమెరికా పంపింది. అక్కడ మంచి ర్యాంకుతో ఉత్తీర్ణుడై ఇండియాకు వచ్చి, మంచి ఉద్యోగంలో చేరితే, సుశీల, ఆమె భర్త కొడుకు దగ్గరే స్థిరపడ్డారు. రఘు తన మేనమామ కూతురును ఇష్టపడితే, ఆమెతో పెళ్లి చేసింది. సుశీల భర్తతో తన ఇంటికి వచ్చేసింది. కొంతకాలానికి మనుమడు పుట్టాడని ఆనందిస్తుండగానే, అకస్మాత్తుగా సుశీల భర్త మరణించాడు. ఆ బాధలో ఉన్న తల్లిని, కంపెనీ పనిమీద అమెరికా వెళ్తున్న రఘు తన వెంట తీసుకెళ్లాడు. అమెరికా ప్రయాణంలో మధురానుభూతుల్ని మూటగట్టుకొని ఇండియాకు వచ్చింది. సాహిత్యం వైపు దృష్టి మరల్చింది. క్రమంగా తరాల మధ్య అంతరం పెరుగుతున్నది. ఇప్పుడు తానొకచోట, తన కొడుకు కోడలు మనుమడు మరొకచోట. ఆ ముదిమిలోనూ, ఒంటరితనంలోనూ, తన జీవితంలోని యదార్థ గాథలన్నిటికి అక్షరరూపం ఇచ్చి నవల రాసింది. సుబ్బాయమ్మ రాసిన ‘ఎదురీత’ నవలలో అక్కడక్కడ కొన్ని వాక్యాలు పునరావృతం కాకుండా ఉంటే బాగుండేది. అయినా ఈ నవల ఆగకుండా చదివిస్తుంది. ఆడవాళ్లలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 80 ఏళ్ల వయసులో ఈ రచయిత్రి ఈ నవల రాయడం విశేషం.
- ఎ. గజేందర్ రెడ్డి 9848894086
