ఎఫ్‌‌ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్‌.. ఇండియాకు స్విస్‌‌ సవాల్‌.. స్విట్జర్లాండ్‌‌తో మ్యాచ్‌‌

ఎఫ్‌‌ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్‌.. ఇండియాకు స్విస్‌‌ సవాల్‌.. స్విట్జర్లాండ్‌‌తో మ్యాచ్‌‌

మదురై: సొంతగడ్డపై ఎఫ్‌‌ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్‌‌లో ఇండియా కఠిన పరీక్షకు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్‌‌ల్లో గోల్స్ మోత మోగిస్తూ చిన్న జట్లు చిలీ, ఒమన్‌‌ను చిత్తుగా ఓడించిన ఆతిథ్య కుర్రాళ్లు మంగళవారం జరిగే  చివరి గ్రూప్ లీగ్ మ్యాచ్‌‌లో బలమైన స్విట్జర్లాండ్‌‌తో తలపడనుంది. 

గ్రూప్– బిలో ఇరు జట్లు ఇప్పటివరకు రెండేసి విజయాలతో అజేయంగా ఉన్నప్పటికీ, మెరుగైన గోల్స్ తేడా కారణంగా ఇండియా టాప్‌‌లో కొనసాగుతోంది.

చిలీపై 7-–0, ఒమన్‌‌పై 17–-0 తేడాతో ఘన విజయాలు సాధించిన ఇండియా.. నాకౌట్ దశకు ముందు తమలోని లోపాలను సరిదిద్దుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా డిఫెన్స్‌‌కు కఠిన పరీక్ష ఎదురవకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశం కాగా, కెప్టెన్ రోహిత్ సారథ్యంలోని డ్రాగ్ ఫ్లిక్ విభాగం పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్‌‌ను నేరుగా మలచడంలో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. 

అయితే, దిల్‌‌రాజ్ సింగ్, అర్ష్‌‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లతో కూడిన మిడ్‌‌ఫీల్డ్, ఫార్వర్డ్‌‌లైన్ అద్భుతంగా ఆడుతుండటం జట్టుకు సానుకూలాంశం. అయినా స్విట్జర్లాండ్‌‌ను తేలికగా తీసుకోకూడదని జట్టు భావిస్తోంది.