ఐదేండ్లలో 4 లక్షల ఉద్యోగాలు : కేటీఆర్

ఐదేండ్లలో 4 లక్షల ఉద్యోగాలు : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలన్ని స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రైబల్ టీచర్స్ యూనియన్ జేఏసీ కన్వీనర్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు సోమవారం మంత్రిని కలిశారు. ఏజెన్సీ పాంతాల్లో గిరిజన టీచర్లకు మాత్రమే బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని.. స్థానికులతోనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఏజెన్సీలో స్థానిక గిరిజన టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలన్ని గిరిజన అభ్యర్థులతోనే భర్తీచేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీవో3ని అమలు చేయడానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఆదివాసీ, గిరిజనులకు న్యాయం చేస్తామని తెలిపారు.  జీవో 3 ప్రకారం ప్రమోషన్లు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యతను రేగకాంతారావు, ఆత్రం సక్కుకు మంత్రి అప్పగించారు. కేటీఆర్ ను కలిసిన వారిలో టీటీయూ జేఏసీ నేతలు కల్లూరి జయబాబు, శ్రీనివాస్​ రావు, రామారావు, రవి, శర్మన్ తదితరులు ఉన్నారు.

ఐదేండ్లలో 4 లక్షల ఉద్యోగాలు

హైదరాబాద్ చుట్టూ 4 మొబిలిటీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్ర మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రానున్న ఐదేండ్లలో 4 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, రూ.50 వేల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ఇ–మొబిలిటీ వీక్​లో భాగంగా.. సోమవారం నిర్వహించిన ఈవీ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర మొబిలిటీ వ్యాలీ దేశంలోనే మొట్టమొదటి న్యూ మొబిలిటీ ఫోకస్ క్లస్టర్ అని చెప్పారు. జహీరాబాద్, సీతారాంపూర్​లలో ఈవీ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ క్లస్టర్, యెంకతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.చార్జింగ్ స్టేషన్ల అభివృద్ధే  లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వంతో ఏటీఎస్​టీయూవీ రైన్ ల్యాండ్​, బిట్స్ హైదరాబాద్​తో బాష్ గ్లోబల్ సాఫ్ట్​వేర్ టెక్నాలజీస్, షెల్ తో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.