బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి

బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి
  • పొలిటికల్​ లీడర్లు ఎవరూ లేరు
  • మీడియాకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడి
  • మొత్తం 100 మంది పాల్గొన్నరు 
  • బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్​ వచ్చాక చర్యలు.. ఐదుగురిని అరెస్ట్ చేశామని ప్రకటన 

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు సిటీ శివారులోని ఓ ఫాంహౌస్ లో జరిగిన రేవ్ పార్టీ ఆ స్టేట్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. ఈ రేవ్ పార్టీలో పలువురు నటీనటులతోపాటు కొందరు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే, రేవ్ పార్టీలో ఒక నటి మాత్రమే పాల్గొన్నారని, ప్రజా ప్రతినిధులు ఎవరూ లేరని కర్నాటక పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. 

రేవ్ పార్టీలో 25 మంది మహిళలు సహా దాదాపు 100 మంది పాల్గొన్నట్టు చెప్పారు. వీరిలో కొందరు డీజేలు, మోడల్స్, టెకీలు ఉన్నారని వెల్లడించారు. బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి టెస్టులకు పంపించామని, ఆ రిపోర్టులు వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రేవ్ పార్టీ కేసుపై మంగళవారం బెగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి. దయానంద్ ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 

‘‘ఈ నెల 19న రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలోని ఓ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో ఆ ఫాంహౌస్ పై సిటీ క్రైమ్ విభాగం పోలీసులు రెయిడ్ చేశారు. రేవ్ పార్టీలో కొకైన్, ఎండీఎం వంటి డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశాం. పార్టీలో దాదాపు వంద మంది పాల్గొన్నారు. వీరిలో చాలా మంది బయటివారు కాగా, కొందరు స్థానికులు ఉన్నారు. పార్టీలో ఒక నటి మాత్రమే పాల్గొన్నది. ప్రజా ప్రతినిధులెవరూ లేరు” అని కమిషనర్ వివరించారు.