ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం 7వ వర్ధంతి

ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం 7వ వర్ధంతి

రోజూ ఉదయాన్నే న్యూస్ పేపర్లు వేసుకుంటూ జీవించిన ఓ పిల్లాడు.. దేశం గర్వించదగ్గ సైంటిస్టుగా మారి ఎందరికో స్పూర్తిగా నిలిచాడు. దేశానికి రాష్ట్రపతి కూడా అయ్యాడు. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం.. సంకల్పం ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా చేరగలమన్న సందేశాన్ని యువతరానికి అందించారు కలాం. దేశ క్షిపణి రంగానికి సరికొత్త మార్గనిర్దేశనం చేశారు. అందుకే ఆయనను 'మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా దేశం పిలుస్తుంది. అబ్దుల్ కలాం 2002 నుంచి 2007 వరకు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. రామేశ్వరం అనే చిన్న గ్రామం నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వరకు కలాం ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. భారతదేశ చరిత్రలో గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరైన కలాం 7వ వర్ధంతి ఇవాళే. కాగా, ఆయన జీవితం ఆధారంగా పలు భాషల్లో చిత్రాలు తెరకెక్కాయి.. ఈ సందర్భంగా అందులోని కొన్ని మూవీస్ గురించి తెలుసుకుందాం.

అయామ్ కలాం..

2011 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే 2010లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితమైంది. ఢిల్లీలోని అబ్దుల్ కలాం నివాసంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ఎ లిటిల్ డ్రీం..

పి. ధనపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు అబ్దుల్ కలాం కథను ప్రదర్శించే ఒక డాక్యుమెంటరీగా రూపొందించారు. ఇది డాక్టర్ కలాం రాసిన "ఎ సాంగ్ ఆఫ్ యూత్" కవిత యొక్క దృశ్య ప్రదర్శనతో ముగిసింది. 

మై హీరో కలాం..

2018 సంవత్సరంలో విడుదలైన ఈ మూవీని కన్నడ భాషలో నిర్మించారు. డాక్టర్ కలాం చిన్ననాటి నుంచి దేశంలోని గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరిగా మారిన కథను ఈ మూవీలో చూడొచ్చు.

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (షూటింగ్ దశలో)..

ఈ బయోపిక్ చిత్రాన్ని 2020లో ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను బీజేపీ నాయకుడు ప్రకాష్ జవదేకర్ సమక్షంలో ఆవిష్కరించారు. జగదీష్ దానేటి, సువర్ణ పప్పు, జాన్ మార్టిన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.