పీఆర్ సీ పదేండ్లకు!..ఐదేండ్లకోసారి సవరణకు గుడ్ బై

పీఆర్ సీ పదేండ్లకు!..ఐదేండ్లకోసారి సవరణకు గుడ్ బై
  • సీఎంకు నివేదించిన ఆర్థిక శాఖ అధికారులు
  • ఉద్యోగుల జీతాలతో ఖజానాపై భారం
  • ఒక శాతం పెంచినా రరూ.225 కోట్ల మోత
  • పీఆర్సీ, ఐఆర్ లేకుండానే బడ్జెట్
  • సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమల్లోకి…

కమిషన్ సిఫారసుల ఆధారంగా ఉద్యోగులకు ఎంత మేరకు ఫిట్​మెంట్​ ఇవ్వాలనేది ప్రభుత్వం డిసైడ్​ చేస్తుంది.  పీఆర్​సీ నివేదికను మక్కీకి మక్కీగా అమలు చేయాలనే నిబంధనలేమీ లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగులతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని  ప్రభుత్వమే  తుది నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్రం వచ్చిన కొత్తలో 43 శాతం ఫిట్మెంట్

రాష్ట్ర విభజనకు ముందు పదో పీఆర్​సీ చేసిన  సిఫారసులు ఉమ్మడి రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక సీఎం కేసీఆర్​ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. 2015 జులైలో  పదో పీఆర్​సీ అమలుకు అంగీకరించారు. ఏకంగా 43శాతం ఫిట్​మెంట్​ప్రకటించారు. 2013 జులై నుంచే పీఆర్​సీ అమలు చేసి.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెంచిన జీతాలను నగదుగా అందించారు. అప్పటివరకు ఉన్న తొమ్మది నెలల  బకాయిలను చెల్లించారు.  దీంతో ఏడాదికి ప్రభుత్వంపై సుమారు ఆరు వేల కోట్ల భారం పడింది.

తెలంగాణ తొలి పీఆర్సీ

పదవ పీఆర్​సీ గడువు నిరుడు జూన్ తో ముగిసింది. 2018 జులై  ఒకటో తారీఖు నుంచి కొత్త వేతన సవరణ జరగాలి. రెండు నెలల ముందుగానే మే 18న  రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్​ సీఆర్​ బిస్వాల్ ఛైర్మన్​గా తెలంగాణ తొలి పీఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించింది. బిస్వాల్ కమిటీ వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో అభిప్రాయాలు తీసుకుని ఇప్పటికే నివేదికను  సిద్దం చేసింది. ఎప్పుడంటే అప్పుడు ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ సర్కారు కమిటీకి సమయం ఇవ్వడం లేదని తెలిసింది.

సీఎంకు ప్రతిపాదనలు పంపిన అధికారులు

బడ్జెట్ సమావేశాలకు ముందే..  పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతోందో  లెక్కలు పంపాలని ఆర్థికశాఖను  ప్రగతి భవన్ వర్గాలు ఆదేశించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్‌‌‌‌‌‌‌‌సీ అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న జీతాలపై ఒక్క శాతం  ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అమలు చేసినా ఖజానాపై రూ. 225 కోట్ల అదనపు  భారం పడుతుంది. 27 శాతం ఫిట్​మెంట్​ఇస్తే ఏడాదికి అదనంగా  సుమారు రూ.6 వేల కోట్ల భారం అవుతుంది. ఇదే అంశాన్ని ఆర్థిక శాఖ సీఎంకు నివేదించింది.  కొత్త పీఆర్సీని ఇప్పుడు ఇచ్చినా   నాలుగేళ్లలో మరో పీఆర్సీ వేయాల్సి వస్తుందని, ఇలా ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేస్తే ఖజానాపై అంతకంతకు భారం పెరుగుతుందని సీఎం వద్ద జరిగిన సమీక్షల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.  ఏటా ఉద్యోగుల జీతాలకు రూ.36 వేల కోట్లు ఖర్చవుతున్నాయని,  నిర్వహణ ఖర్చులు తగ్గించాలంటే  కేంద్రం తరహాలో పదేళ్లకు ఒకసారి జీతాలు పెంచడం మంచిదని కొందరు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పొరుగు రాష్ట్రాల్లోనూ కేంద్రం అనుసరించే విధానమే అమల్లో ఉందని నివేదించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలిసింది.

ఇప్పటికే జీతాలు ఎక్కువ

తెలంగాణలో ఇప్పటికే జీతాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. రాష్ట్రం వచ్చిన కొత్తలో జీతాలు భారీగా పెంచామని చెపుతోంది. ఇప్పుడు మళ్లీ జీతాలు పెంచడం అవసరమా.. అని ప్రగతి భవన్ కు సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ అధికారి అన్నారు. కేంద్రం తరహాలో పదేళ్లకు ఒకసారి జీతాలు పెంచితే సరిపోతుందని అన్నారు.  కేంద్రం పదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేస్తుంది. అదే తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. కేంద్రం డీఏ పెంచినప్పుడు ఇక్కడ కూడా డీఏ ఇస్తే సరిపోతుందన్నారు. ఇంత శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంపై సీఎం  సీరియస్ గా ఉన్నారని అన్నారు. పదేళ్లకు ఒకసారి పీఆర్సీ వేస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం అధికార పార్టీకి లేదని సదరు సీనియర్ అధికారి చెప్పారు. 2018 అసెంబ్లీ  ఎన్నికల్లో మెజార్టీ ఉద్యోగులు టీఆర్ఎస్ కు ఓటు వేయలేదని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మెజారిటీ ఓట్లు టీఆర్ఎస్ కు రాలేదని చెప్పారు. అయినా మెజార్జీఅసెంబ్లీ స్థానాలు గెలవలేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనే కరీంనగర్,మెదక్ అదిలాబాద్, నిజామాబాద్​ పట్టభద్రుల నియోజకవర్గం లో పోటీ చేయలేదని గుర్తు చేశారు.