ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ షిఫ్టింగ్ షురూ

ఫైనాన్స్ డిపార్ట్​మెంట్  షిఫ్టింగ్ షురూ
  • ‘బడ్జెట్’ పూర్తి కావటంతో నేటి నుంచి పనుల్లో వేగం
  • నెలాఖరు కల్లా కూల్చివేత,డిజైన్ల ఖరారు
  • బీఆర్కే కు సెక్రటేరియెట్ క్యాంటీన్
  • సెలవుల్లోనూ కొనసాగుతున్న ఫర్నిచర్, ఫైళ్ల తరలింపు
  • ఏపీ గేట్, వైఫై బంద్.. త్వరలో కరెంట్, నీటి సరఫరా కూడా

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ షిఫ్టింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే చాలా వరకు పూర్తి కాగా, మిగిలి ఉన్న శాఖల ఫర్నిచర్, సామగ్రిని బీఆర్కే భవన్​కు తరలిస్తున్నారు. బడ్జెట్ ఉన్న కారణంగా ఆర్థిక శాఖ షిఫ్టింగ్ చేయలేదు. సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో.. ఫైనాన్స్​డిపార్ట్​మెంట్ తరలింపు కూడా ప్రారంభం కానుంది. డీ బ్లాక్ లోని 3వ ఫ్లోర్​లోని ఆర్థిక శాఖ పేషీలో ఉద్యోగుల క్యాబిన్లు, ర్యాక్ లు తొలగించే ప్రక్రియ బుధవారం నుంచి వేగంగా సాగనుంది. మరో వారం, పది రోజుల్లో ఆర్థిక శాఖ షిఫ్టింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లుంబిని పార్క్ వైపు ఉన్న ఏపీ గేట్​ను, అక్కడ వైఫై ను అధికారులు బంద్ చేశారు. షిఫ్టింగ్ పూర్తి కాగానే విద్యుత్, నీటి సరఫరా కూడా నిలిపేయాలని అధికారులు భావిస్తున్నారు.

కూల్చివేత, డిజైన్ పై త్వరలో నిర్ణయం

సెక్రటేరియెట్ కూల్చివేతపై ప్రభుత్వం ఈ నెలాఖరు కల్లా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని బ్లాక్ లను జిలెటిన్ స్టిక్స్ ద్వారా ఇంప్లోజివ్ పద్ధతిలో తక్కువ సమయంలో కూల్చివేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కూల్చివేత, ఖర్చు, కూల్చిన తర్వాత వ్యర్థాల తరలింపు వంటి అంశాలపై అసెంబ్లీ సమావేశాలు ముగియగానే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో కొత్త సెక్రటేరియెట్ నిర్మాణ డిజైన్ ను సీఎం ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. చెన్నైకి చెందిన ఓ ఆర్కిటెక్చర్ రూపొందించిన డిజైన్ ను గతంలో సీఎం మీడియాకు చూపించారు. ముంబై ఆర్కిటెక్చర్ హఫీజ్ కాంట్రాక్టర్ కూడా కొత్త సెక్రటేరియెట్ డిజైన్లు రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో సీఎం కేసీఆర్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు తెలుస్తోంది.

క్యాంటీన్ షిఫ్ట్

గత నెల 8వ తేదీ నుంచి సెక్రటేరియెట్ తరలింపు జరుగుతున్నా.. క్యాంటీన్ మాత్రం షిఫ్ట్ కాలేదు. అయితే  రెండు రోజుల కిందట క్యాంటీన్ షిఫ్ట్ చేయాలని జీఏడీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో మంగళవారం బీఆర్కే భవన్ కు షిఫ్ట్ చేశారు. ఏపీ విభజన తర్వాత తెలంగాణ సెక్రటేరియెట్ కు ప్రత్యేకంగా క్యాంటీన్ భవనం లేకపోవటంతో తాత్కాలికంగా పోచమ్మ గుడి సమీపంలో చలువ పందిళ్లు వేసి నడిపించారు. తర్వాత శాశ్వతంగా రూ.18 లక్షల ఖర్చుతో రేకుల షెడ్ నిర్మించారు. ఎనిమిది నెలల కిందటే ఇది ప్రారంభమైంది. ఇపుడు బీఆర్కేకు క్యాంటీన్ షిఫ్ట్ చేస్తుండటంతో ఈ నిధులు వృథా అయినట్లేనని ఉద్యోగులు అంటున్నారు.

finance department shifting Started from secretariat