
గద్వాల, వెలుగు : హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ ముఖ్యమని కలెక్టర్ సంతోష్ విద్యార్థులకు సూచించారు. పదో తరగతి ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మంగళవారం కలెక్టరేట్ లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి పదో తరగతి పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన 34 మంది విద్యార్థులను కలెక్టర్ అభినందించి భవిష్యత్ ప్రణాళిక గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ఇంటర్మీడియట్ దశ విద్యార్థుల దిశను నిర్ధేశిస్తుందని తెలిపారు. ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. టెక్నాలజీని అవసరం మేరకు ఉపయోగించుకోవాలని చెప్పారు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ గని, హెచ్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.